కేసీఆర్ చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేరు..

రాజు మంచోడైతే.. రాజ్యపాలన బాగుంటుంది. తన కింద పనిచేసే సైన్యం, అధికారగణం బాగుంటుంది. రాజే అక్రమాలను ప్రోత్సహిస్తే అథోగతి పాలవుతుంది. తెలంగాణ రాజ్యంలో మాత్రం కేసీఆర్ కొత్త భాష్యం చెప్పారు. అన్యాయం చేసిన ఎవ్వరైనా సహించేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఓ ఐఏఎస్ ను అవమానించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేను చీవాట్లు పెట్టి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఆమెకు సారీ చెప్పించారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. గతంలో ఇలానే ఏపీలో జరిగిన పనికి చంద్రబాబు రియాక్ట్ అయిన దానికి విమర్శలు వస్తున్నాయి..

ఆ మధ్య ఆంద్ర ప్రదేశ్ లో ఒక మహిళా తహసీల్దారును అధికార పార్టీ ఎమ్మెల్యే కలియుగ దుశ్శాసనుడిలా జుత్తు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళినపుడు ఆ అభాగిని తన పాలకుడు ఒక ధృతరాష్ట్ర సమానుడు అని ఎరుగక వెళ్లి మొర పెట్టుకున్నది. తన శరణు కోరిన ద్రౌపదిని ద్వాపర యుగ ధృతరాష్ట్రుడు అంధుడు అయినప్పటికీ, రెండో మూడో వరాలను ప్రసాదించి కొంత ఉపశాంతిని కలిగించాడు. కానీ ఈ కలియుగ ధృతరాష్ట్రుడు మాత్రం, శరణువేడిన మహిళా అధికారిని ముక్క చీవాట్లు పెట్టి పంపించారు!!

నిన్నగాక మొన్న సాక్షాత్తూ ఒక ఐపీఎస్ అధికారి కాలర్ పట్టుకున్నాడు మరో ఎంపీ గారు ఆయన గారి ఆఫీసు లోనే. ఆ అధికారి బిక్కచచ్చి పోయి తన గౌరవాన్ని మంట కలిపేసుకున్నాడు తప్ప సదరు ఎంపీ గారిని పల్లెత్తి మాట అనలేకపోయాడు.

ఈ రోజు మహబూబాబాద్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా తో అసభ్యంగా ప్రవర్తించాడని వార్త పొక్కగానే ముఖ్యమంత్రి కేసీయార్ వెంటనే తీవ్రంగా స్పందించి ప్రవర్తన సరిగా లేదని ఆ ఎమ్మెల్యేను మందలించడమే కాకుండా, కలెక్టర్ ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మహిళల పట్ల ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా సహించేది లేదని కుండబద్దలు కొట్టారు.

ముఖ్యమంత్రి స్థాయికి కలెక్టర్ అంటే చిన్న అధికారే. అయినప్పటికీ, అధికారుల ఆత్మగౌరవం, విలువ తెలిసిన విజ్ఞుడు, వివేకి, సుచక్షువు కాబట్టి ప్రభుత్వం తరపున కలెక్టర్ తో మాట్లాడి సముదాయించవలసిందిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ చర్య ద్వారా అధికారుల ఆత్మగౌరవాన్ని అంబరాన్ని తాకించారు కేసీయార్. అంతే కాదు.. అధికారులతో ఎవరు దురుసుగా ప్రవర్తించినా, రాజకీయ నాయకుల పై చర్యలు తప్పవు అని ఒక ఘాటైన సందేశాన్ని పంపించారు…అధికారులు అంకిత భావంతో పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వారికే రక్షణ లేకపోతే ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లా అవినీతిలో అగ్రస్థానం, అభివృద్ధిలో అట్టడుగు స్థానం సంపాదించుకుంటుంది.

ముప్ఫయి ఏళ్ల అనుభవం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. మూడేళ్ళ అనుభవం ఉన్న దీక్షాదక్షుడి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. దేశంలోని పాలకులు అందరూ నేర్చుకోవాల్సిన రాజనీతిని ఈరోజు కేసీయార్ ఆచరించి చూపించారు.

To Top

Send this to a friend