గురువు గారి లోటు భర్తీ చేయలేనిది

టాలీవుడ్‌లో ఎందరికో గురువు గారు దాసరి నారాయణ రావు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లతో పాటు అప్పటి తరం హీరోలకు ఎన్నో అద్బుత విజయాలను అందించిన దాసరి నారాయణ రావు ఈతరం నటీనటుల్లో ఎంతో మందిని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. నటన అంటే తెలియని వారిని ఇండస్ట్రీకి తీసుకు వచ్చి స్టార్స్‌ను చేశారు. కింది స్థాయిలో ఉన్న వారిని తన ఆశీర్వాదంతో ఉన్నత స్థితికి తీసుకు వచ్చారు. మోహన్‌బాబు వంటి ఎంతో మందిని దాసరి నారాయణ రావు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ విశ్వాసంతోనే దాసరిని అంతా కూడా గురువు గారు అంటూ ఉంటారు.

దాసరి అండదండలతో సినిమా ఇండస్ట్రీలో ఎదిగిన వారి సంఖ్య వందల్లో ఉంటుంది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎంతో మంది దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్స్‌, నిర్మాతలు కూడా దాసరి నీడ నుండి వచ్చినవారే. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దాసరి నారాయణ రావు పెద్ద నిర్మాతలపై పలు సందర్బాల్లో విరుచుకు పడ్డారు. చిన్న సినిమాను బతికించేందుకు ఆయన చాలా కృషి చేశారు. టాలీవుడ్‌లో ఏ చిన్న నిర్మాత పిలిచినా కూడా ఆయన ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందు ఉండేవారు.

దాసరి మరణ వార్త తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన దాదాపు అంతా కూడా ఆయనతో తమ అనుబంధాన్ని నెమరవేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన లేని లోటును మరెవ్వరు భర్తీ చేయలేరని, ఆ స్థాయి సినిమాలు చేయడం ప్రస్తుత దర్శకులకు ఏ ఒక్కరికి సాధ్యం కాదని అంటున్నారు. మీడియా వారితో కూడా చాలా సన్నిహితంగా ఉంటూ, మీడియాకు సముచిత స్థానం కల్పించిన దర్శకుడు దాసరి. సినిమా యూనిట్‌లో అంతా సమానం కాదు అని, దర్శకుడు నిర్మాత కంటే ఎక్కువ అంటూ దాసరి అన్న మాటలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ డైరెక్టర్‌ అంటూ దాసరి ఎప్పుడు అంటూ ఉండేవారు. గురువుగారు దాసరి నారాయణ రావు గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

To Top

Send this to a friend