సూదులు, దబ్బనంలు ఈటెలు అవుతాయి కేసీఆర్ జీ..

ఉద్యమకారుడే.. తోటి ఉద్యమకారులను దారుణంగా అణిచివేస్తున్నాడు. కేసీఆర్ .. పోలీసులను ఉపయోగించి జేఏసీ, ప్రతిపక్షాలను ఇంతలా అణిచివేయడం తెలంగాణలోని సగటు మనిషిని అంతర్మథనంలో పడేసింది. ఇందిరాపార్కు’వద్ద ”సరిహద్దు నియంత్రణ రేఖ”ను కేసీఆర్ సోమవారం గీశారు.ఈ సరిహద్దు వద్ద ఇక ధర్నా లు,ఆందోళన, నిరసన కార్యక్రమాలకు చోటు లేదు.ప్రజలు తమ నిరసన తెలిపే హక్కు లేదు.”కేసీఆర్ ఇంత అభివృద్ధి చేస్తుంటే ఇంకా నిరసనలు ఎందుకు” అని కొందరు ఇందిరాపార్కు సమీప బస్తీల ప్రతినిధి ఒకరు టిఆర్ఎస్ పార్టీ న్యూస్ ఛానల్ లో ప్రశ్నించాడు. నిజమే మరి. అడిగినా అడగకుండానే కేసీఆర్ ప్రజలపై సంక్షేమ వరాలు గుప్పిస్తున్నప్పుడు నిరసన దేనికి?మార్నింగ్ వాకర్స్ కు, ధర్నా చౌక్ ముట్టడికి పిలుపునిచ్చిన వారికి ఏక కాలంలో పోలీసులు అనుమతించడం విడ్డూరమే..

అయితే ఇందులో మహిళా పోలీసులే ‘వాకర్స్’రూపం ఎత్తడం ఇంకో విడ్డూరం. ఖమ్మం లో మార్కెట్ యార్డు పై రైతులు దాడి చేస్తే ‘వాళ్లు రైతులు కాదు.గూండాలు.సంఘ విద్రోహ శక్తులు. తెలుగుదేశం ముసుగులో వచ్చిన శక్తులు’అని పోటీ పడి మంత్రులు హడావుడిగా ప్రకటనలు చేశారు. తర్వాత ఏమైంది? అరెస్ట్ అయిన వాళ్ళు రైతులు అని తెలింది. రైతులను ఇనుప గొలుసులతో జైలు నుంచి కోర్టుకు తీసుకు వస్తే ప్రభుత్వం అపఖ్యాతి పాలైంది. చేతులు కాలాక సి.ఎం.కేసీఆర్, మంత్రులు పోచారం, తుమ్మల అండ్ కో ఆకులు పట్టుకున్నారు.”రైతులకు బేడీలు వేసిన వాడు మొగోడు కాదు.ఖచ్చితంగా పాపాత్ముడు” అని ముఖ్యమంత్రి పోలీసులపై శాపనార్ధాలు పెట్టారు.కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది.తాజాగా ధర్నా చౌక్ వ్యవహారం లోనూ కేసీఆర్ ప్రభుత్వం లోని పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి నష్ట పరచనున్నది. వాకర్స్ కు , ఆందోళన కారులకు మధ్య జరిగిన హింస ,ఇతర ఘటనలు కేసీఆర్ ను అప్రతిష్ట పాలు జేసేవే.

టిఆర్ఎస్ అధినేత, ప్రభుత్వ సారధి కేసీఆర్ కన్నా మించిన సిసలు ఉద్యమ కారుడు ఎవరు? ఆయన తప్ప ప్రజాస్వామ్య బద్దంగా నిరసన గళం ఇంకెవరూ విప్పగూడదా?అందుకు ఒక ప్రత్యేక స్థలం,వేదిక అవసరం లేదా?చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది కేసీఆర్ స్కీం కావచ్చు. అందులో భాగంగానే సోమవారం నాటి ధర్నా చౌక్ ఘటనను చూడవలసి ఉంటుంది.పైగా అసెంబ్లీ వేదికగానే “సూది బ్యాచ్”, “డబ్బనం బ్యాచ్ “లంటూ లెఫ్ట్ పార్టీ లను కడిగేశారు. ఉద్యమాలను హింసాత్మకంగా మార్చేందుకు కమ్యూనిస్టులు ఎలాంటి ఎత్తుగడలు పన్నుతారో చాలా డ్రమాటిక్ గా సి.ఎం వివరించారు.మొత్తం మీద కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో ప్రజాస్వామిక శక్తులు, సంస్థలను అణచి వేయాలని ప్రయత్నిస్తున్నారో గానీ ఈ ఉదంతాలు వికటించే అవకాశం ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

To Top

Send this to a friend