ఏమయ్యా ‘కిరణాలు’.. మా కిరణాలు చూడు..


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అది అందరికీ సమానంగా న్యాయం చేస్తుంది. తెలంగాణ ఎన్నో ఏళ్ల కల.. 1969 నుంచి నేటి 2009 ఉద్యమం వరకు ఎంతో మంది అమరుల ప్రాణత్యాగంతో తడిసిన నేల.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన నేల.. అందుకే ఆ వేడి, ఆ కసి.. మూడేళ్ల తెలంగాణ పాలనలో కనిపించింది. నవ్విన ఆంధ్రా నేతలకు బద్ధి వచ్చేలా తెలంగాణ స్వయం పాలనలో.. కరెంట్ చీకట్లను చీల్చడంలో విజయం సాధించింది.

ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో తెరమీద కర్రపట్టుకొని మరీ టీచర్ లా చెప్పుకొచ్చారు. తెలంగాణ వస్తే మొదట కరెంట్ కొరతతో రాష్ట్రం యావత్తు చీకట్లో మగ్గుతుందని హెచ్చరించారు. అప్పటికే కాంగ్రెస్ హయాంలో ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ కోతలతో హైదరాబాద్ మొదలుకొని పల్లెల వరకు కరెంట్ కోతలు అనివార్యంగా మారేవి. చిన్న చితక పరిశ్రమలు, కులవృత్తులు, దుకాణాల వారు కరెంట్ లేక పని నడవక పస్తులుండేవారు. తెలంగాణ ఏర్పడితే ఏపీలోని కరెంట్ ఇవ్వరని.. తెలంగాణ కారు చీకట్లలో మగ్గుతుందని కిరణ్ హెచ్చరించారు. అంతేకాదు.. చత్తీస్ ఘడ్ నుంచి నక్సలైట్లు తెలంగాణ కు వస్తారని.. నక్సలైట్ల స్థావరంగా తెలంగాణ మారిపోతుందని హెచ్చరించారు. అంతేకాదు నీటి పంచాయతీలు, కృష్ణ నది నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. కొట్టుకు చస్తారని శపనార్థాలు పెట్టారు..

కానీ కిరణ్ అన్న మాటల్ని తెలంగాణ తొలి రాష్ట్ర సీఎం కేసీఆర్ , ఇక్కడి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చంద్రబాబు కరెంట్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టినా సరే కేవలం సంవత్సరన్నర కాలంలోనే తెలంగాణ కరెంట్ చీకట్లను పారద్రోలడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఇందుకోసం మేధావులతో కలిసి పక్క ప్రణాళికలు రచించి కరెంట్ కష్టాలు తీర్చారు. ఇప్పుడు తెలంగాణలో మొత్తం గ్రామాలు, పట్టణాలకు 24 గంటల కరెంట్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందుతోంది.పోలీసులకు నిధులు, అత్యాధునిక వాహనాలు, ఆయుధాలు ఇచ్చి నక్సలైట్లకు చెక్ పెట్టారు. నీళ్ల లొల్లి ఏపీతో వదిలిపోయింది. సొంతంగా ప్రాజెక్టులు కడుతున్నారు. ఇది నిజంగా కేసీఆర్ సాధించిన విజయం.. ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే.. వచ్చింది..

తెలంగాణ ఐఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు తెలంగాణ హోంమంత్రి నాయిని ఈరోజు హైదరాబాద్ లోని సచివాలయానికి వచ్చారు. అక్కడ ఆన్ లైన్ ప్రక్రియను ప్రారంభించి ఆయన ఉద్వేగానికి గురయ్యారు.. ‘తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్నాడు. ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న అదే నిండు సభలో ఇవాళ తెలంగాణలోని అన్ని రంగాలకు నిధులు కేటాయించుకున్నాం.. కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం. తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా దూసుకెళ్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు నువ్ తెలంగాణ అభివృద్ది గురించి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో.. ఇది మేం నీకు చెప్పిన గుణపాఠం’ అని హోంమంత్రి నాయిని కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజంగా తెలంగాణ ఓ పడిలేచిన కెరటం.. నవ్విన నాపచేనే పండింది. అపహాస్యం చేసిన వారి నోళ్లు మూడేళ్లలోనే మూతపడ్డాయి.

To Top

Send this to a friend