అరువు నేతలతో ఇంకెన్నాళ్లు..

మొన్న అమిత్ షా వచ్చాడు.. ఈరోజు రాహుల్ గాంధీ వస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురునిలిచే నాయకుడు లేక జాతీయ పార్టీలు కునారిల్లుతున్న తీరును ఈ పర్యటనలు తేటతెల్లం చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లలో బలమైన నాయకత్వ లేమి ఆ పార్టీలకు ఇబ్బందిగా మారింది. అందుకే మొన్ననే అమిత్ షా వచ్చి బీజేపీ శ్రేణుల్లో ఆత్మస్తైర్యం నింపారు. కేసీఆర్ పై పోరాడాలని సూచించారు.

అమిత్ షా పర్యటన ముగియగానే ప్రధాన ప్రతిపక్షంగా వెనుకబడి పోతామని అనుకున్నారో ఏమో కానీ కాంగ్రెస్ నాయకులు తమకు భరోసా కల్పించే పనిని చేపట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలంగాణలోని సంగారెడ్డిలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాగర్జన సభకు ఆహ్వానించారు. ఆయన రాకతోనైనా కాంగ్రెస్ నేతలు ఒక్కతాటికిపైకి వచ్చి పార్టీ బలోపేతంపై కృషి చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు..

తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్.. టీఆర్ఎస్ బలమైన శక్తి. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. అలాంటి బలమైన కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టాలంటే స్థానిక నాయకుల బలం సరిపోదు.. అందుకే బీజేపీ, కాంగ్రెస్ లు ఢిల్లీ నుంచి నాయకులను అరువు తెచ్చుకుంటున్నాయి. అమిత్ షా, రాహుల్ గాంధీలు తెలంగాణలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ నిలకడ లేని.. నాయకత్వలోపం ఉన్న కాంగ్రెస్, బీజేపీల తలరాతలు మారుతాయనుకుంటే అది అతిశయోక్తే అని అంటున్నారు విశ్లేషకులు..

To Top

Send this to a friend