చంపేది మిమ్మల్ని చూసే.. తప్పంటే ఎలా మోడీజీ


మోడీ ఒక ప్రకటన చేశాడు. గుజరాత్ లోని మహాత్మా గాంధీ నడిపిన సబర్మతి ఆశ్రమంలో పర్యటించిన మోడీ అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. అదీ తన పార్టీ బీజేపీకి చెందిన నాయకుల అతిపై.. కానీ ఒక్క విషయాన్ని మోడీ మరిచిపోయాడు. ప్రస్తుతం బీజేపీలో శాసించే స్థితిలో మోడీ ఉన్నాడు. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతోంది. ఆయన తలుచుకుంటే కానిది ఏదీ లేదు. అలాంటి మోడీ బీజేపీ నేతలు చేస్తున్నది తప్పు అన్నాడే కానీ.. ఆ చర్యలను అరికట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది..

మోడీ సబర్మతి ఆశ్రమంలో మాట్లాడుతూ.. ‘ఆవులను రక్షించే పేరిట వాటిని కోసి అమ్ముతున్న వ్యక్తులను హిందుత్వవాదులు చంపడం చాలా బాధాకరం’ అని పేర్కొన్నారు. ఇంట్లో చీమలకు, వీధిలో కుక్కలకు, నీటిలో చేపలకు ఆహారం అందించే మనం.. గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఇలా మనుషులను చంపడంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు గోవులను ఎలా రక్షించాలో గాంధీ, వినోభాభావే చూపించారు. వారి బాటనే అనుసరించాలని హింసావాదులకు సూచించారు. ఆవులకోసం మనుషులను చంపడం గోభక్తి కాదు అని స్పష్టం చేశారు..

నిజానికి గత కాంగ్రెస్ పాలనలో ఇలా ఆవుల మాంసం అమ్మే ముస్లింలపై దాడులు, హత్యలు జరగలేదు. పాకిస్తాన్ కూడా ఇంతలా రెచ్చిపోలేదు. మన జవాన్లతో యుద్ధానికి దిగలేదు. కానీ మోడీ వచ్చాక పాలనలో అతి ఎక్కువైపోయింది. కమల దళాలు హిందుత్వ రాజకీయాలను మోసుకొచ్చాయి. దానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సపోర్టు ఉంది. అందుకే హిందుత్వ వాదులు రెచ్చిపోతున్నారు. గో సంరక్షణ పేరిట ముస్లింలను, దళితులను చంపుతున్నారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలమే.. మోడీ తలుచుకుంటే దీన్ని అరికట్టడం పెద్ద సమస్యే కాదు. కానీ చేయడు.. ఎందుకంటే హిందుత్వమే మోడీ బలం, బలహీనత.. దాని జోలికిపోకుండా.. చంపడం భావ్యం కాదని మాత్రమే మోడీ అనడం ఏం విడ్డూరం..

To Top

Send this to a friend