యువ హీరో నాని ప్రస్తుతం టాలీవుడ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకుల్లో రాజమౌళి ఏ స్థాయిలో విజయాలతో దూసుకు పోతున్నాడో హీరోల్లో నాని కూడా అలాగే సక్సెస్ను దక్కించుకుంటున్నాడు. తాజాగా విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రంతో వరుసగా నానికి ఏడు సక్సెస్లు అందాయి. ఈ సక్సెస్లతో నాని యమ జోష్ మీద ఉన్నాడు. సక్సెస్లు వచ్చినప్పుడు హీరోలు పారితోషికం పెంచడం అనేది సర్వ సాదారణం. అలాగే నాని కూడా పారితోషికం పెంచేశాడు.
నాని తన పారితోషికాన్ని ఏకంగా 8 కోట్లకు పెంచేశాడు. ఈ స్థాయిలో నాని పారితోషికం డిమాండ్ చేస్తున్నా కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇటీవలే నిర్మాత దిల్రాజు అంత భారీ మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పి అడ్వాన్స్ ఇచ్చాడు. వచ్చే సంవత్సరంలో దిల్రాజు బ్యానర్లో నాని సినిమా ఉండబోతుంది. ఇక నాని సినిమాల బడ్జెట్లు కూడా పెరిగి పోయాయి. గతంలో 10 కోట్లు లేదా 15 కోట్లు. అంతకు మించి నాని సినిమా బడ్జెట్ ఉండేది కాదు.
ప్రస్తుతం నాని సినిమాల బడ్జెట్ మినిమం 20 కోట్లుగా చెబుతున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమాలకు ఒక్కో దానికి 5 నుండి ఏడు కోట్లు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం కోసం ఏడు కోట్లు తీసుకున్నా కొన్ని కారణాల వల్ల రెండు కోట్లు తిరిగి ఇచ్చేశాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న ‘పైసా వసూల్’ చిత్రానికి 6 కోట్లు తీసుకుంటున్నాడు. త్వరలో చేయబోతున్న 102వ సినిమాకు 7 కోట్లకు కాస్త అటు ఇటుగా తీసుకుంటున్నాడు. అంటే ప్రస్తుతం బాలకృష్ణ కంటే నాని ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లుగా చెప్పుకోవచ్చు. నాని మరో రెండు సినిమాలు సక్సెస్ అయితే 10 కోట్ల పారితోషికం అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
