ఎన్టీఆర్‌కు పోటీగా నాని కూడా..!

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ మూడు పాత్రల్లో ఒక పాత్ర నెగటివ్‌ ఛాయలు కలిగి ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ మాదిరిగా యువ హీరో నాని కూడా నెగటివ్‌ రోల్‌ను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. నాని త్వరలో ‘నిన్ను కోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా విడుదలవ్వడమే ఆలస్యం వెంటనే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు గాంధీ రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని నానితో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. ఒక మంచి సబ్జెక్ట్‌ను నానికి చెప్పడం, ఛాలెంజింగ్‌ పాత్ర అవ్వడంతో నాని వెంటనే ఓకే చెప్పడం జరిగిందట. నాని ఆ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని, అందులో ఒకటి నెగటివ్‌ రోల్‌ అని కూడా సమాచారం.

‘జెంటిల్‌మన్‌’ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో మొదట నానిది నెగటివ్‌ రోల్‌ అనుకున్నారు. కాని నాని జెంటిల్‌మన్‌ నెగటివ్‌గా కనిపించలేదు. కాని గాంధీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో మాత్రం పూర్తిగా నెగటివ్‌ రోల్‌లో నాని కనిపిస్తాడని, నాని నటనకు పరీక్ష పెట్టే పాత్ర అంటూ సమాచారం. సహజ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న నాని తన ప్రతి సినిమాలో కూడా నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను మాత్రమే చేస్తూ ఉన్నాడు. మరోసారి నాని నటనలో మరో స్టెప్‌ ఎక్కేందుకు డబుల్‌ రోల్‌ను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

To Top

Send this to a friend