ఓంకార్‌ను విసిగిస్తున్న నాగార్జున..!

వరుస విజయాలతో దూసుకు పోతున్న సమయంలో ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో నాగార్జున కాస్త నిరుత్సాహ పడ్డాడు. ఆ ఫ్లాప్‌ నుండి వెంటనే తేరుకుని చేస్తున్న సినిమా ‘రాజుగారి గది 2’. ఈ సినిమాపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఓంకార్‌ దర్శకత్వంలో విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ముఖ్య పాత్రలో నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ముగియాల్సి ఉన్నా కూడా నాగార్జున కొన్ని సీన్స్‌కు మళ్లీ మళ్లీ రీ షూట్‌ చెబుతుండటంతో ఇంకా షూటింగ్‌ పూర్తి కాని పరిస్థితి కనిపిస్తుంది.

నాగార్జున తను నిర్మించిన లేదా నటించిన ఏ సినిమాను అయినా చివరకు రషెస్‌ చూసి కొన్ని మార్పులు చేర్పులు చెబుతూ ఉంటాడు. వాటికి అనుగుణంగా కొన్ని రీ షూట్స్‌ కూడా చేయాల్సి ఉంటుంది. అలా సోగ్గాడే చిన్ని నానయ, ఊరిపి, రారండోయ్‌ వేడుక చూద్దాం చిత్రాలకు కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే రాజుగారి గది 2 చిత్రానికి కూడా కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయాల్సిందిగా దర్శకుడు ఓంకార్‌కు నాగార్జున సూచించినట్లుగా తెలుస్తోంది.

మొదట కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయమనగా వారం రోజుల పాటు ఆ సీన్స్‌ను దర్శకుడు రీ షూట్‌ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయాల్సిందే అంటూ నాగార్జున పట్టుబడుతున్నాడట. దాంతో దర్శకుడు ఓంకార్‌కు చిర్రెత్తుకు వస్తుందని, స్టార్‌ హీరో కనుక మూసుకుని మళ్లీ రీ షూట్‌కు ఏర్పాట్లు చేస్తున్నాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే నెలలో ‘రాజుగారి గది 2’ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా లేదా దీపావళి సందర్బంగా సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.

To Top

Send this to a friend