నాగార్జున తన ఇద్దరు కొడుకులను హీరోలుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే చిన్న కొడుకు అఖిల్‌పై చూపినంత శ్రద్ద పెద్ద కొడుకు నాగచైతన్యపై నాగార్జున చూపించడు అనే ఆరోపణలు ఉన్నాయి. నాగచైతన్య మొదటి సినిమా విషయంలో నాగార్జున పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇప్పటి వరకు కూడా నాగచైతన్య స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోలేక పోయాడు. అదే అఖిల్ సినిమా విషయంలో మాత్రం ప్రతి అంశంను కూడా దగ్గరుండి చూసుకున్నాడు.
తాజాగా బోయపాటి శ్రీనుకు నాగార్జున 13 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరుసగా మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను దక్కించుకుంటున్న బోయపాటి శ్రీనుతో తన కొడుకు హీరోగా ఒక సినిమా నిర్మించాలని నాగార్జున భావిస్తున్నాడు. ఆ సినిమాలో అఖిల్ నటిస్తాడని అంతా భావించారు. అయితే బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చింది అఖిల్ కోసం కాదని, నాగచైతన్య కోసం అంటూ నాగార్జున నుండి క్లారిటీ వచ్చింది.
ఇప్పటి వరకు నాగచైతన్యకు కమర్షియల్‌గా సక్సెస్‌లు దక్కలేదు. భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్య కోసం బోయపాటి ఒక మంచి కథ సిద్దం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని చేస్తున్న బోయపాటి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు. ఆ తర్వాత అక్కినేని హీరోతో బోయపాటి మాస్ చిత్రాన్ని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
