తమ్ముడిని వదలని ముఖేష్ అంబానీ

ఒకే ఒక నెట్ వర్క్.. జియో.. దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. అప్పటివరకు అప్రతిహతంగా రేట్లు పెంచి లాభపడ్డ ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, రిలయన్స్ సంస్థలకు షాక్ ఇస్తూ జియో సామాన్యుడికి డేటా, కాల్స్ సేవలను ఉచితంగా అందించింది. ఈ దెబ్బకు దేశీయ టెలికాం కంపెనీలన్నీ కుదేలయ్యాయి. నష్టాల పాలయ్యాయి. ఇప్పటికీ సదురు కంపెనీలు లాభాల కోసం అష్టకష్టాలు పడుతున్నాయి. జియో తెచ్చిన ఈ విప్లవాత్మక సంస్కరణతో సామాన్య జనానికి లబ్ధి చేకూరగా ప్రత్యర్థి టెలికాం కంపెనీల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

జియో దెబ్బకు మరో టెలికాం కంపెనీ కుదేలయ్యింది. ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ జియో వల్ల తీవ్రంగా నష్టాలపాలై అప్పులు తీర్చే మార్గం లేక కుదేలవుతోంది. దీనిపై తమ్ముడు అనిల్ అంబానీ తీవ్ర ఆరోపణలు చేశాడు. మార్కెట్ షేర్ పెంచుకునేందుకు జియో అనుసరించిన విధానాలపై అనిల్ అంబానీ సంచలన ఆరోపణలు చేశారు. జియో ఫ్రీ ఆఫర్ల వల్లే ఇలా అయ్యిందని అనిల్ ఆరోపించారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. జియో ఫ్రీ ఆఫర్లే దేశీయ టెలికాం కంపెనీల నష్టాలకు కారణమని అన్న ముఖేష్ అంబానీ కంపెనీపై ధ్వజమెత్తారు.

జియో దెబ్బకు రిలయన్స్ టెలికాం సంస్థ అప్పులు చరిత్రలో మొదటిసారి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను మించిపోయిందని అనిల్ అంబానీ ఆవేదన వ్యక్తం చేశారు. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం.. ఫలితంగా రిలయన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అనిల్ వాపోయారు.. దీనంతటికి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియోనే కారణమని వెల్లడించారు.

To Top

Send this to a friend