చంద్రబాబులకు పడింది పిడి..!


మొద్దబ్బాయి.. మొద్దబ్బాయి అని అంటారు కానీ నిన్నటి రాహుల్ గాంధీ ప్రసంగం విన్నాక ఆయనను ఆ మాట ఎవరూ అనే సాహసం చేయరు.. ఎందుకంటే ఎంతో ఇతిబద్దంగా చంద్రబాబు, మోడీల హామీలను ఎండగడుతూ.. ఏపీకి న్యాయం చేస్తామంటూ రాహుల్ చేసిన ప్రసంగం శభాష్ అనిపించేలా ఉంది. హిందీలో అదరగొట్టిన రాహుల్ కు తెలుగులో అనువాదం సమస్యతో అది జనాలకు సరిగ్గా అర్థం కాలేదు.. తెలంగాణలో అనువదించిన దాసోజు శ్రవణ్ ఉంటే ఇంకా బాగా రాహుల్ ప్రసంగం జనాలకు చేరేది.. కానీ రాహుల్ చేసిన ప్రసంగంలో ఆ పదాలు, విమర్శలు ప్రత్యర్థులైన చంద్రబాబు, మోడీకి గునపాల్లా దిగాయి.

మాజీ ఎంపీ జేడీ శీలం రాహుల్ ప్రసంగాన్ని అనువదించాడు. రాహుల్ ఎన్నో సునిశిత, బుల్లెట్ లాంటి విమర్శలను చంద్రబాబు, మోడీలపై సంధించారు. రాహుల్ ప్రసంగించిన ఆ అద్భుత మాటలను జేడీ శీలం తెలుగులో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. కానీ హిందీలో రాహుల్ చేసిన ప్రసంగం నభూతో నభవిష్యతి అన్న చందంగా మారింది..

రాహుల్ ప్రసంగం అద్భుతంగా సాగింది. ఆయన ఎక్కడ చూసి మాట్లాడలేదు. కానీ ఎంతో పకడ్బందీ స్క్రిప్ట్ గా ఆకట్టుకుంది. ఆయన ప్రసంగంలోని విశేషాలను చూస్తే శభాష్ అనాల్సిందే..

‘మోడీని హిందూ చాంపియన్ అంటారు.. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అంటాడు.. కానీ తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదాను ఎందుకు వదిలేశాడు’ అని రాహుల్ విమర్శించారు.. ఇక ఇదే కాదు చంద్రబాబును వదలకుండా కడిగేశాడు రాహుల్..

‘పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం కడుతానంటే చంద్రబాబు ఒప్పుకోడు.. ఏపీ నిధులతోనే కడతాను అంటాడు.. ఎందుకంటే కేంద్రమే కడితే చంద్రబాబుకు కమీషన్లు రావు కదా’ అని రాహుల్ చంద్రబాబును కడిగేశాడు.

‘మోడీ అంటే చంద్రబాబుకు, జగన్ కు భయం.. అందుకే వారు హోదాపై వెనక్కి తగ్గారు. కానీ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో వెనక్కిపోదు.. కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు మోడీ అంటే భయం లేదు.. హోదా మీకు కానుక, వరం కాదు.. మీ హక్కు’ అంటూ ఏపీ ప్రజలకు స్ఫూర్తి దాయక ప్రసంగం చేశాడు రాహుల్..

మొత్తానికి రాహుల్ సభతో ఒక్కటి మాత్రం స్పష్టమైంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సైలెంట్ అయిన తీరు.. ప్రతిపక్ష జగన్ కేసుల భయంతో వెనక్కి తగ్గిన తీరును రాహుల్ బాగా ఎండగట్టారు. కాంగ్రెస్ పై ప్రజల్లో, నాయకుల్లో విశ్వాసం కల్పించడంలో రాహుల్ విజయం సాధించాడు

To Top

Send this to a friend