మంత్రి పదవిని అద్దెకు తీసుకున్న సోమిరెడ్డి తనయుడు

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు మరోసారి వివాదాస్పదమైంది. నిత్యం సంఘసంస్కర్తలాగా మాట్లాడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన విషయంలో మాత్రం వాటిని పాటించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా తండ్రి హోదాలో సోమిరెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఎలాంటి పదవి, అర్హత లేకపోయినప్పటికీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారిక కార్యక్రమాలను నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా ఎత్తిపోతల పథకానికి ట్రయల్ రన్ ప్రారంభించారు చిన్న సోమిరెడ్డి.

నెల్లూరు జిల్లా పొదలకూరులో 60 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి మంత్రి చేతుల మీదుగా ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి తన స్థానంలో కుమారుడిని పంపించారు. తూముల వద్ద పూజలు చేసి నీటిని విడుదల చేశారాయన. వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్న సోమిరెడ్డి… ఇప్పుడు ఏకంగా తన మంత్రిదండం ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమానికి కుమారుడిని పంపడం చర్చనీయాంశమైంది. ఎలాంటి పదవి లేని రాజగోపాల్ రెడ్డి ట్రయల్ రన్ ప్రారంభించేందుకు రావడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి హోదా లేని వారు పథకాన్ని ప్రారంభిస్తే వివాదం అవుతుందని సూచించారు. అయినా సోమిరెడ్డి పుత్రుడు లెక్కచేయలేదు. అధికారులందరినీ పక్కకు పంపించి టీడీపీ కార్యకర్తలతో కలిసి పూజలు, ట్రయల్ రన్ ప్రారంభం చేసేశారు. ఈ అధికార దుర్వినియోగంపై మంత్రి సోమిరెడ్డి ఏమంటారో చూడాలి.

To Top

Send this to a friend