భగీరథ.. నీ వారసుడొచ్చాడు..

నీరు పల్లమెరుగు.. కానీ కేసీఆర్..నీటిని పల్లం నుంచి ఎత్తుకే పంపిస్తున్నారు. ఇందుకోసం భగీరత యత్నమే చేస్తున్నాడు.. అపర భగీరథుడిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు. మహారాష్ట్ర, కర్ణాటక లు గోదావరి నీటిని వడిసిపెట్టి కిందకు వదలిపెట్టకపోవడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వట్టిపోతోంది. ఈ ప్రాజెక్టులోకి ప్రాణహిత నది నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెనకకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ లోకి పంపించేందుకు కేసీఆర్ మహా ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కోట్లు ఖర్చు చేస్తూ ఈరోజు నిజామాబాద్ లో శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇంతకీ ఈ నీటిని ఎలా పంపింగ్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం..

ఎస్సారెస్పీలోకి నీరు రావాలంటే ఇక మహా రాష్ట్రపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందుకు గోదావరి నీటిని రివర్స్‌ పంపింగ్‌ చేయనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీలోకి తరలిస్తారు. ఈ క్రమం లో మూడుచోట్ల ఎత్తిపోతలను నిర్మించాలని నిపుణులు సూచించారు. కాళేశ్వరం నుంచి 140 కి.మీ. మేర ఎత్తిపోతలు నిర్మించి నీటిని తీసుకొస్తారు. మొత్తం ఏడు ఎత్తిపోతలు నిర్మి స్తారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఎత్తిపోతలకు సంబంధించిన పంపుహౌస్‌ నిర్మాణపనులు కాళేశ్వరం పథకంలో భాగంగా కొనసాగుతున్నాయి.ఎల్లంపల్లి, నంది మేడా రం వద్ద ఇదివరకే పంపుహౌస్‌ నిర్మాణ పనులు పూర్తయి వినియోగంలో ఉండగా, వరదకాలువపై మూడు ఎత్తిపోతల పనులు, పంపుహౌస్‌ నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్ల వరకు, దాని నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి తరలిస్తారు.

నంది మేడారం చెరువు సామర్థ్యం పెంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారానికి, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని వరదకాల్వలోకి తరలిస్తారు. వరదకాల్వ ద్వారా మధ్యమానేరు, ఎస్సారెస్పీ లకు నీటి సరఫరా చేసేందుకు మూడు ఆనకట్టలు నిర్మించి, రోజుకు టీఎంసీ చొప్పున మధ్యమానేరు, ఎస్సారెస్పీలోకి పంపిస్తారు. బాగా వర్షాలు పడే సమయంలో జూలై నుంచి 60 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని తరలిస్తే, ఆ ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 14 లక్షల ఎకరాలు ఆయకట్టు, దానిపై ఆధారపడిన ఎత్తిపోతలు, ఇతర స్కీములకు సమృద్ధిగా నీరు అందుతుంది.

కేసీఆర్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ గనుక వర్కవుట్ అయితే తెలంగాణ నీటి కష్టాలు దూరమైనట్టే.. అపరభగీరథుడిగా తెలంగాణ చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend