టాలీవుడ్‌ను మెగా హీరోలు ఏలేస్తున్నారు. ప్రస్తుతం పలువురు మెగా హీరోలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఎంత మంది మెగా హీరోలు ఉన్నా కూడా వారి సినిమాల విడుదల విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. కనీసం రెండు లేదా మూడు వారాల గ్యాప్ ఉండేలా మెగా హీరోలు ప్లాన్ చేసుకుంటారు. కాని మొదటి సారి వారం రోజుల గ్యాప్‌లో ఇద్దరు మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అయ్యారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రం’ చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో అసలు హీరో సందీప్ కిషన్ అయినా కూడా సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఎక్కువ సమయం కనిపించనుండటంతో దీనికి మెగా మూవీ అనే బ్రాండ్ దక్కింది. దాంతో ప్రేక్షకుల్లో ‘నక్షత్రం’పై అంచనాలు భారీగా ఉన్నాయి. క్రియేటివ్ దర్శకుడు ‘నక్షత్రం’తో ఆకట్టుకుంటాడనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు.
ఇక మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఫిదా’ వారం రోజుల తర్వాత అంటే ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు సంబంధించిన టీజర్లు మరియు ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ రెండు మెగా మూవీలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది నిలిచేనో చూడాలి.
