మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలైనప్పటి నుండి కూడా రచయిత శరత్ చంద్ర అనే వ్యక్తి తన కథతో సినిమాను తెరకెక్కించారు అంటూ న్యాయ పోరాటం చేస్తున్నాడు. నాంపల్లి కోర్టులో ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇటీవలే మహేష్‌బాబు మరియు దర్శకుడు కొరటాల శివ హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ వివాదం బాలీవుడ్‌కు పాకింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో మహేష్‌బాబు పోషించిన పాత్రను పోషించబోతున్నాడు. ఆ సినిమా ప్రారంభం కానున్న నేపథ్యంలో రచయిత శరత్ చంద్ర ఇప్పుడు బాలీవుడ్‌కు కూడా నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది.
చాలా కాలం క్రితం తాను ఒక వార పత్రిక కోసం రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాను మీరు రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం కథ కోర్టులో ఉంది. అందుకే మీరు రీమేక్ చేసే ముందు ఆలోచించాలని, ఆ కథకు సంబంధించిన హక్కులు తన వద్ద ఉన్నాయంటూ ఆయన నోటీసులు పంపించాడు. మరి బాలీవుడ్ ‘శ్రీమంతుడు’ మేకర్స్ ఆ నోటీసులకు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
