దక్షిణాది వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి

.

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలిసిపోయింది. ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా దళిత కార్డును ఉపయోగించి దేశ అత్యున్నత పీఠంపై దళిత వ్యక్తిని కూర్చోబెట్టడానికి రెడీ అయ్యారు. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి బీజేపీ సీనియర్లను కాదని.. మోడీ బీహార్ గవర్నర్ గా ఉన్న కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.. ఇప్పుడూ అంతే గోప్యంగా వ్యవహరిస్తూ మరో దక్షిణాది వ్యక్తికి అత్యున్నత పీఠం అప్పగిస్తున్నారనే వార్త సంచలనం రేపుతోంది.

రాష్ట్రపతి పీఠం ఇప్పటికే ఉత్తరాదికి చెందిన కోవింద్ కు దక్కబోతోంది. కేంద్రంలోని ప్రధాన అధికారాలన్నీ ఉత్తరాది వారి చేతుల్లోనే ఉన్నాయన్న అప్రపద ఎక్కువవుతోంది. అందుకే ఆ అపవాదును పోగొట్టుకునేందుకు బీజేపీ దక్షిణాది వ్యక్తికి దేశ ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దక్షిణాదిలో మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ గా చాలా మెరుగ్గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావు దేశ అత్యున్నత రెండో పీఠం ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 11న ముగుస్తోంది. ఆయన ప్లేసులో విద్యాసాగర్ రావును నిలబెట్టవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన విద్యాసాగర్ రావు ఆదినుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లలో పనిచేశారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా కాలం కలిసివచ్చి ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు. దక్షిణాది వ్యక్తికి మోడీ ఈ పదవి ఇవ్వాలని భావిస్తే విద్యాసాగర్ రావు ఉపరాష్ట్రపతి అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

To Top

Send this to a friend