కొత్త ప్రతిపాదనలకు ప్రభుత్వం నో!

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలి అన్న చందంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు తయారయ్యాయి. ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగం.. పాలన సౌలభ్యం అని చెప్పినప్పటికీ అక్కడ అవసరమైన అధికారులను భర్తీ చేయడంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు లేక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. అవసరం మేరకు పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదనలు పంపిస్తుంటే వాటికి సూత్రప్రాయంగా అంగీకరించాల్సిన ఆర్థిక శాఖ సున్నితంగా తిరస్కరించి ప్రతిపాదనల ను వెనక్కి పంపు తోంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే రెవిన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మున్సిపల్, పంచాయి తీరాజ్, సంక్షేమ శాఖలకు కొత్త జిల్లాలో అధికారులు కరవయ్యారు. దీంతో పాలన కుంటుపడుతోంది. ఇటువంటి పరిస్థితులలో కొత్త ఉద్యోగాల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాల్సిన ప్రభుత్వం వాటిని వెనక్కి పంపిస్తోంది. ఉన్నవారితోనే నెట్టుకు రావాలని చెబుతోంది.

120 వ్యవసాయ పోస్టుల భర్తీకి తిరస్కరణ: కొత్తగా ఏర్పా టైన మండలాలలో వ్యవసాయ అధికారులు (ఎఓ)గా ప్రస్తుతం ఇంఛార్జ్‌లు నెట్టుకొస్తున్నారు. దాదాపు 120 ఎఓ పోస్టులు అవసరమని వ్యవసాయ శాఖ ప్రతిపాదన తయారు చేసింది. దీనిని ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపితే వెనక్కి పంపింది. ఉన్నవారితోనే సర్దిపెట్టుకోవాలని సూచించినట్లు తెలిసింది. అదే విధంగా వ్యవసాయ సహాయ సంచాలకుల పోస్టులకు కూడా రెడ్ సిగ్నల్ వేసింది. రెవిన్యూ శాఖ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కొత్త మండల రెవిన్యూ కార్యాల యాల్లో కూడా ఇంఛార్జులతో కాలం వెల్లదీస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఆమోదానికి సంబంధించి కూడా ప్రభు త్వం పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్‌లు, మండల కార్యాలయాలలో ఇంఛార్జులతో కాకుండా శాశ్వత ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తేనే అనుకున్న లక్షం నెరవేరుతుంది.

To Top

Send this to a friend