ఈరోజు స్టార్‌గా ఉన్న దర్శకుడు రేపు అవకాశాలు లేక దిక్కులు చూసే పరిస్థితి రావచ్చు, నేడు చేతిలో పది సినిమాలున్న హీరోకు రేపు ఒక్క సినిమా ఛాన్స్ కూడా అందక పోవచ్చు. సినిమా పరిశ్రమ అంటే ఇలాగే ఉంటుంది. నేడు పరిస్థితి ఒకలా ఉంటే రేపు మరోలా ఉంటుంది. అందుకే పరిస్థితి బాగా ఉన్న సమయంలోనే నాలుగు రాల్లు వెనకేసుకోవాలని ఇప్పుడిప్పుడే అంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. గతంతో ఈ విషయాన్ని గమనించక సినిమాల్లో మంచి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుని ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు చాలా మంది ఉన్నారు.
ఇక దర్శకుల విషయంలో మరీ ఈ విషయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దర్శకులకు ఒకటి లేదా రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే మళ్లీ ఛాన్స్ రావడం దాదాపు అసాధ్యం. అందుకే దర్శకుడు కొరటాల శివ తన తర్వాత సినిమాకు పారితోషికంగా కాకుండా లాభాల్లో వాటను తీసుకోబోతున్నాడు. ‘శ్రీమంతుడు’ చిత్రానికి రెండున్నర కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న దర్శకుడు కొరటాల జనతాగ్యారేజ్‌కు 6 కోట్ల పారితోషికం, త్వరలో మహేష్‌బాబుతో చేయబోతున్న సినిమాకు దాదాపు 8 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఆ సినిమాకు ఏకంగా 30 నుండి 35 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉంది.
మహేష్‌బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత మిత్రుడు డిస్ట్రిబ్యూటర్ అయిన మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. దర్శకుడిగా కొరటాల శివ పారితోషికం తీసుకోకుండా, తక్కువ బడ్జెట్లోనే ఎన్టీఆర్‌తో సినిమాను పూర్తి చేయిస్తాను అంటూ సుధాకర్‌కు మాట ఇచ్చాడు. అయితే అందుకు గాను సీడెడ్ మరియు వైజాగ్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌ను ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు నిర్మాత ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం రైట్స్ ద్వారా ఖచ్చితంగా కొరటాలకు 35 కోట్లకు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది. కొరటాల మాత్రమే కాకుండా ఇలా ఎంతో మంది దర్శకులు ఇలా మెలిక పెడుతున్నారు. కొరటాల కూడా తెలివిగా ఆలోచించి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు.
