పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదనుకోవడం .. ఎంత మాంసం తిన్నా బొక్కలు మెడలో వేసుకుని తిరగడం ఎందుకు వంటి సామెతలు తెలంగాణలో చాలా ఉన్నాయి. అచ్చంగా జేఏసీ చైర్మన్ కోదండరాం ఈ పద్దతినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. వెనకటికి సమాచార వ్యవస్థ లేని కారణంగా ఏ నాయకుడు ఎలాంటి వాడు ? ఆయన వాదన వెనక మర్మం ఏంటి ? అన్నది జనాలకు తెలిసేది కాదు. తాము నమ్మితే గుడ్డిగా జనం ఫాలో అయ్యేవారు. కానీ కాలం మారింది … నాయకుడి ప్రసంగం పూర్తయ్యేలోపు ఆయన ఆరోపణలు, ఆలోచన వెనక పూర్వపరాలు ఆయన ఫేస్ బుక్ వాల్ మీదనో .. ఆయన వాట్స్ అప్ ఫోన్ లోనో వాలిపోతున్నాయి. ఆయన ఆరోపణలకు ఎంత సమర్ధత, ఎంత వ్యతిరేకత ఉందన్నది వెంటనే తెలిసిపోతుంది.
అయితే గత ఏడాదిన్నరగా తెలంగాణ వ్యతిరేక అజెండాను భుజాన వేసుకుని తిరుగుతున్న కోదండరాం తెలంగాణ ప్రయోజనాలు మినహా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తిరుగుతున్నాడు. తెలంగాణకు హైకోర్టు కావాలని గానీ, తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా ప్రభుత్వ నిర్ణయాలను గానీ, తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో గానీ ఏనాడూ కోదండరాం జేఏసీ చైర్మన్ గా ఓ నిరసన కార్యక్రమం పెట్టింది లేదు. కేంద్రానికి ఓ లేఖ రాసిన పాపాన పోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని రికార్డెడ్ గొంతుతో గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. అయితే ప్రజల నుండి ఎలాంటి స్పందన రావడం లేదు.
గత 60 ఏండ్ల ప్రభుత్వాలను, గత మూడేళ్ల తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను గమనించిన ప్రజలు సహజంగానే తెలంగాణ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాలను .. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బేరిజు వేసుకుంటారు. కోదండరాం బృందానికి ఈ విషయం తెలియనిదేమీ కాదు. కాకుంటే తెలంగాణ వ్యతిరేక శక్తుల జట్టుకట్టి ఆయన తాను కూడా తెలంగాణ వ్యతిరేకశక్తిగా తయారయ్యాడు.
ఈయన జేఏసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈనను కాంగ్రెస్, టీడీపీలు వదిలేశాయి. కోదండరాం మీద టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇక సీపీఎం పార్టీ అసలు ఉద్యమంలోనే లేదు. ఆఖరు నిమిషం రాజ్యసభలో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. తెలంగాణ ఏర్పడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది ఆ పార్టీ .. తెలంగాణ రాష్ట్ర తొలి బహిరంగసభలు జరుపుకున్నది ఆ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఆలస్యానికి కారణం అయి .. అడ్డుకుని తెలంగాణ ప్రజల మానసిక వ్యధకు, యువత బలిదానాలకు కారణం అయిన ఈ పార్టీల కండువాలు మెడలో వేసుకుని .. కాంగ్రెస్ అర్ధ, అంగబలాల అండతో కోదండరాం తెలంగాణలో తిరుగుతున్నది తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోలేరని భావించడం ఆశ్చర్యంగా ఉంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి చేపడుతున్న ప్రాజెక్టులను, ఉద్యోగాలను కోర్టు కేసులతో కాంగ్రెస్ తో కలిసి అడ్డుకోవడంలో కోదండరాం బిజీగా ఉన్నారు. వాటిని అడ్డుకుంటేనే తమకు భవిష్యత్ ఉంటుంది .. అవి పూర్తయితే తెలంగాణలో తమకు నూకలు చెల్లినట్లేనని భావిస్తున్న కాంగ్రెస్ నిస్సిగ్గుగా పనులు, ఉద్యోగాలు అడ్డుకుంటూ కోదండరాంను ముందుపెట్టి ఆరోపణలు చేయిస్తుంది.
ఎంత కాంగ్రెస్ కొంగు వెనక దాక్కున్నా ప్రస్తుత సమాచార వ్యవస్థలో వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించుకునే ప్రజలు తమకు, తెలంగాణకు ఎవరు మేలు చేస్తున్నారు ? ఎవరు ద్రోహం చేస్తున్నారు ? అన్నది గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికయినా ముసుగు వీడి కాంగ్రెస్ కండువానో .. సొంత పార్టీ జెండాను పెట్టుకుని రంగంలోకి దిగితే కోదండరాం సత్తా ఏంటో ప్రజలు తేలుస్తారు.
