ఇంత స‌డ‌న్‌గా కోదండ‌రాం ‘రెడ్డి’ఎలా అయ్యాడు..


తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండరాం పూర్తి పేరు కోదండ‌రాం రెడ్డి! ఆయ‌న‌ది తెలంగాణ‌లో బ‌ల‌మైన రెడ్డి సామాజిక‌వ‌ర్గం! ఈ విష‌యం ఎందుకు తెలియ‌దు? అభ్యుద‌య భావాల‌తో ముందుకు సాగే ఐకాస చైర్మ‌న్‌ త‌నంత తానుగా కులాల తోక‌ను క‌త్తిరించుకున్నారు అందుకే రెడ్డిఅని ఎక్క‌డా పేరు ప్ర‌స్తావించుకోరు అయితే ఈ విష‌యం హ‌ఠాత్తుగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి గుర్తుకువ‌చ్చింది. ఎందుకంటారా… రెడ్డి సామాజిక‌వ‌ర్గం పేరుతో ఆయ‌నపై ఎదురుదాడి చేసేందుకు!

స్వ‌రాష్ట్ర సాధ‌న‌లో జోడెడ్ల వ‌లే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ముందుకు సాగారు, స‌బ్బండ‌వ‌ర్గాల‌ను ఏకం చేసి క‌దిలారు. రాజ‌కీయ వ్యూహాల్లో కేసీఆర్ అందెవేసిన చేయి అయితే వాటిని ప‌క్కాగా అమ‌లు చేస్తూ స‌క‌ల‌జ‌నుల‌ను కోదండ‌రాం మాష్టారు ఒక్క‌తాటిపైకి తీసుకువ‌చ్చి పోరాటం వైపు మ‌ళ్లించారు.

అయితే ఆ త‌దుప‌రి ర‌క‌రకాల ప‌రిణామాల‌తో ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయికి ప‌రిస్థితి చేరింది. మొద‌ట్లో కోదండ‌రాం స‌త్తాను లైట్ తీసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌థ్యంలోని గులాబీ ద‌ళం ఆ త‌ర్వాత క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యింది. టీఆర్ఎస్‌కు కోదండ‌రాం ఏకు మేకు అవుతున్న‌ట్లు గుర్తించి ఎదురుదాడి మొద‌లుపెట్టింది. ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సార‌థ్యంలోని జేఏసీ త‌ల‌పెట్టిన అమ‌రుల స్పూర్తియాత్ర మొద‌టి మూడు టూర్ల‌ను ప‌ట్టించుకోని అధికార పార్టీ నాలుగో టూర్‌ను మాత్రం టార్గెట్ చేసింది. దీని వెన‌క ఉద్దేశం కోదండ‌రాం సారు బ‌లం పెర‌గ‌డ‌మేన‌ని అంటున్నారు.

అయితే కోదండ‌రాంను ఎదుర్కునేందుకు టీఆర్ఎస్ పార్టీకి అస్ర్తాలు క‌నిపించ‌లేదు. ఆయనుకున్న క్లీన్ ఇమేజ్, ప్రజల్లో ఆదరాభిమానాలతో విమర్శించడానికి టీఆర్ఎస్ నేతలకు పెద్దగా కారణాలు కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు కులాన్ని ఆపాదించి కోదండరాంను దెబ్బతీయడానికి టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అందుకే కోదండరాం రెడ్డి అంటూ కొద్దిరోజులుగా ఆయన కులముద్ర వేసి అభాసుపాలుచేస్తున్నారు.

To Top

Send this to a friend