జేఏసీ నాయకుడు కోదండరాంకు కామారెడ్డి జిల్లాలో చేధు అనుభవం ఎదురయింది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం మీద బురదజల్లడం, ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని వ్యతిరేకించడమే ధ్యేయంగా పెట్టుకుని పర్యటనలు చేస్తున్న కోదండరాం వ్యవహారం మీద సాధారణ ప్రజానీకానికి ఎంత వ్యతిరేకత ఉందో కామారెడ్డి జిల్లాలో నిన్న ఎదురయిన నిరసనలతో తేలిపోయింది. ప్రతి దాన్ని వ్యతిరేకించి దానికి ప్రజామోదం ఉందన్న భ్రమల్లో ఉన్న కోదండరాంకు తాజా ఘటన కళ్లు తెరిపించి ఉండాలి.
ఆంధ్రా ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేస్తుంటే, కేంద్రానికి లేఖలు రాస్తుంటే తెలంగాణ జేఏసీ నుండి ఒక్క నిరసన కార్యక్రమం కానీ చేపట్టింది లేదు. ప్రశ్నించింది లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేయించడం, భూసేకరణకు అడ్డుపడడం, నిరసనలు రేపడం, నిర్వాసితులను రెచ్చగొట్టుడు లాంటి కార్యక్రమాలు జేఏసీ పుష్కలంగా చేస్తోంది.
అయితే 60 ఏండ్లుగా నీళ్లన్నీ ఆంధ్రాకు మలిపి తెలంగాణను ఎండబెట్టారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను కోదండరాం వ్యతిరేకించడం రైతులకు నచ్చలేదు. అందుకే కామారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బికనూర్, కామారెడ్డిలో రైతులు తీవ్ర నిరసన తెలిపారు. ఇప్పటికయినా కోదండరాం సమీక్షించుకుని తన నిరసనలలో నిజాయితీ ఎంతో తేల్చుకోకుంటే మరిన్ని పరాభవాలు తప్పకపోవచ్చు
