పిల్లల ప్రాణాలు తీస్తున్న గేమ్..

మీ పిల్లలు ఆన్‌లైన్‌ గేములు ఆడుతున్నారా? ఐతే వారిని ఓ కంట కనిపెట్టండి. ఎందుకంటే.. ‘బ్లూవేల్‌’ అనే ఆట ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇది ఆడినవారు దీనికి బానిసలవడం, తరువాత ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణం. రష్యాకు చెందిన 23 ఏళ్ల మానసిక వ్యాధిగ్రస్తుడు ఈ వికృత క్రీడను రూపొందించాడు. 15 ఏళ్లలోపు విద్యార్థులే లక్ష్యంగా ఈ గేమ్‌ నిబంధనలు ఉండటం గమనార్హం. వీరికి లోకజ్ఞానం అంతగా లేకపోవడం, ప్రతీది తెలుసుకోవాలన్న కూతూహలం అధికంగా ఉండటమే ఈ ఆటకు బానిసలుగా మారుస్తోంది.

నిన్న మొన్నటిదాకా ప్రపంచదేశాలని గడగడలాడించిన ఈ వికృతక్రీడ ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనల్ని సృష్టిస్తోంది. మొన్న ముంబైలో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడటంతో బ్లూవేల్‌ గేమ్‌ మనదేశంలోనూ ఉందన్న కలకలం రేగింది. మన్‌ప్రీత్‌ గేమ్‌కు బానిసయ్యాడు. రూల్స్‌లో భాగంగా ఆఖరు టాస్క్‌ విధించారు. దాని ప్రకారం.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి. దానికి ముందు ఓ ఫోటోను నెట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అలాగే చేసి ప్రాణాలు తీసుకున్నాడు ఆ అమాయక బాలుడు. కన్నవారికి తీరనిశోకం మిగిల్చాడు.

తాజాగా షోలాపూర్‌లోనూ దీని ఆనవాళ్లు వెలుగుచూడటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. 9వ తరగతి విద్యార్థి ప్రవర్తనలో తేడాలు తల్లిదండ్రులు గమనించారు. ఓ రోజు లేఖరాసి అదృశ్యమవడంతో అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాలుడి ఫొటోతో గాలింపు మొదలుపెట్టిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బ్లూవేల్‌ గేమ్‌ టాస్క్‌ పూర్తిచేయడానికి తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్నట్లు బాలుడు చెప్పడంతో వారు హతాశయులయ్యారు.
తాజాగా ఇండోర్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన 13 ఏళ్ల విద్యార్థి స్కూలు బిల్డింగు మీద నుంచి దూకేందుకు ప్రయత్నించడం కలకలం రేగింది. తోటివిద్యార్థులు, ఉపాధ్యాయులు బలవంతంగా ఆపితేగానీ వారికి అతడిని నిలువరించడం సాధ్యపడలేదు. దీంతో పిల్లలకు ఆన్‌లైన్‌ గేమ్స్‌ అందుబాటులో ఉంచకూడదని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు.

ఎప్పుడు మొదలైంది?
ఆన్‌లైన్‌ వేదికగా సాగే ఆట. దీన్ని రూపొందించిన వ్యక్తి ఓ మెంటల్‌. వాడిని రష్యా పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టినా.. అప్పటికే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అవడంతో ప్రపంచమంతా పాకిపోయింది. అతడిలానే మానసికంగా గతితప్పినవాళ్లు దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఆందోళనకరంగా మారింది. ఏకంగా 130మందికి పైగా రష్యన్‌ టీనేజర్లు ఈ గేమ్‌ వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గుర్తించారు.

ఎలా ఆడతారు?
బ్లూవేల్‌ ఆడాలంటే ముందు ఇందులో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 50 దశలు ఉంటాయి. టాస్క్‌లు అప్పగించేందుకు మెంటార్లు ఉంటారు. వీరు తొలుత చాలా సులభమైన టాస్క్‌లు అప్పజెబుతారు. టాస్క్‌ పూర్తికాగానే అందుకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే మరో దశకు చేరుకుంటారు. అలా ఆఖరు దశ 50 వ దశ. ఇందులో ఆత్మహత్య చేసుకోవాలి. చేసుకునే ముందు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయాలి.

చేయకపోతే ఏం చేస్తారు?
1. మొదట్లో సులువైన పనులే అప్పజెబుతారు.
2. క్రమంగా డోసు పెంచుతూ పోతుంటారు.
3. తాము ఇదివరకు చేయని పనులు కావడంతో విద్యార్థులు సైతం ఉత్సాహంగా చేసుకుంటూ పోతారు.
తీవ్రత పెరిగే కొద్ది అసభ్యకరమైన పనులు చేయమంటారు. ప్రతీదానికి ఆధారంగా ఫొటో తీసిపెట్టాలి. అపుడే, మరో టాస్క్‌ అప్పజెబుతారు.
5. జీవితంపై అవగాహన ఉన్న, తెలివైన విద్యార్థులు దీన్ని మధ్యలోనే వదిలేస్తున్నారు. కొందరు మాత్రం కొత్తటాస్క్‌పై ఆసక్తితో ఆడుతున్నారు.
6. మరికొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారు. టాస్క్‌లో భాగంగా అసభ్యకరమైన పనులు చేయించుకుని ప్రతీది ఫొటో అప్‌లోడ్‌ చేయమంటారు కాబట్టి.. గేమ్‌ మధ్యలో ఆపితే వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తారు. దీంతో తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. ఇష్టం లేకున్నా గేమ్‌లో కంటిన్యూ అవుతున్నారు.
7. బ్లూవేల్‌ ఆడుతున్నట్లు ఎవరికీ చెప్పకూడదు గేమ్‌రూల్స్‌లో ఇదే కీలకం. అందుకే, విద్యార్థులు చనిపోయే వరకు ఎవరూ గుర్తించలేకపోతున్నారు.

ఎలా గుర్తించాలి?
1. ఈ గేమ్‌ ఆడే విద్యార్థులు అన్యమనస్కంగా ఉంటారు. ఎవరితో మాట్లాడరు, రాత్రుళ్లు మేల్కొంటారు. తమను తాము గాయపరుచుకుంటారు.
2. టాస్క్‌ పూర్తి చేసిన ప్రతీసారి ఏదో సాధించామని, అంతులేని ఆనందంతో కనిపిస్తుంటారు.
3. ఆందోళనతో, నిద్రలేమితో బాధపడుతుంటారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.
4. నిత్యం ఆన్‌లైన్, ఇంటర్‌నెట్‌ కోసం వెంపర్లాడుతుంటారు.

To Top

Send this to a friend