బీజేపీతో కయ్యానికి కేసీఆర్ అస్త్రం ఇదే..

బీజేపీ – టీఆర్ఎస్ సంబంధాలపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిజెపీతో కేసీఆర్ అమీతుమీకి సిద్ధమయ్యారా ? ఇది జీఎస్టీ పెట్టిన చిచ్చా ? లేకపోతే రాజకీయ సమీకరణలు మారుతున్న క్రమమా ? అనేది తెలియాల్సి వుంది. మొదట జీఎస్టీ ముసాయిదాను, తర్వాత బిల్లును కేసీఆర్ దేశంలోనే అందరికంటే ముందే ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజల అవసరాలను తీర్చడంలో జీఎస్టీ ప్రక్రియ విఫలమైందని రాష్ర్టానికి రావాల్సిన అనేక అంశాలు జీఎస్టీ మూలంగా నష్టపోతున్నామని టీఆర్ఎస్ తన వాయిస్ ను పెంచింది. ఈ క్రమంలో బిజెపీకి వ్యతిరేకంగా జీఎస్టీ విషయంలో బహిరంగ ప్రకటనలకు సిద్ధపడింది గులాబీ దండు.

ప్రజల అవసరాల మేరకే మా రాజకీయాలుంటాయని, అది బిజేపీతో దోస్తీ కావచ్చు ఇంకే రాజకీయ పక్షంతో మేకు కుదుర్చుకునే డీల్ కావచ్చని టీఆర్ఎస్ నాయకుల వాయిస్ ను బట్టి తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంతో జీఎస్టీ కి వ్యతిరేకంగా అన్నీ రకాల నిరసనలను తెలపటానికి అలాగే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమంటున్నారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు జీఎస్టీ మూలంగా ఆలస్యమయ్యే ఛాన్సులున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం దగ్గర కేంద్రం వివిధ ప్రాజెక్టుల దగ్గర వసూలు చెయ్యాలని నిర్ణయించిన 12 శాతాన్ని 5 శాతానికి పరిమితం చెయ్యాలనేది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఇవిలా వుంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ కార్యక్రమాలకు 18 శాతం జీఎస్టీ ని వసూలు చెయ్యాలని కేంద్రం ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ 18 శాతం జీఎస్టీ ని వ్యతిరేకించడంతో జీఎస్టీ కౌన్సిల్ 12 శాతానికి కుదించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం 5 శాతం డిమాండ్ చేయడం, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది వేచి చూడాలి. అయితే ఇప్పటి కేంద్ర మంత్రి బంఢారు దత్తాత్రేయ కేసీఆర్ తో రాయబారానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మరో వైపు ఇంకో ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది ఎంపీలను బిజెపీ తనలో కలుపుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ విషయం తెల్సిన కేసిఆర్ ముందుగానే బిజెపీ పై తిరుగుబాటు జెండా ఎత్తినట్టుగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

To Top

Send this to a friend