కేసీఆర్ సర్వే.. బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరిగింది. గత ఎల్పీ మీటింగ్‌లో సర్వే ఫలితాలతో దడ పుట్టించిన కేసీఆర్ ఇవాళ జరగబోయే సమావేశంలో కేవలం భూసర్వేపై చర్చకే పరిమితమవుతారా?.. లేక ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై దృష్టిపెడతారా అనే చర్చ పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎల్పీ మీటింగ్ జరిగినా అది కేవలం ఆ ఎన్నికల అంశానికే పరిమితమైంది. అయితే ఈ సారి శాసనసభాపక్షం భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు.

మరోవైపు ఎల్పీ మీటింగ్ పేరు వినగానే పార్టీ ఎమ్మెల్యే,ఎంపీల్లో టెన్షన్ మొదలైంది. మీటింగ్ కేవలం భూసర్వేల అంశానికే పరిమితమవుతుందని చెబుతున్నా పార్టీకి సంబంధించిన ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. గత ఎల్పీ మీటింగ్‌లో ప్రజాప్రతినిధుల గెలుపోటముల గురించి తాము నిర్వహించిన సర్వేలను బయటపెట్టి వారికి క్లాస్ తీసుకున్నారు. ఇప్పటికే మూడు సర్వేల ఫలితాలను నేతల ముందుంచిన కేసీఆర్ తాజాగా నాలుగోసారి కూడా ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై సర్వే నిర్వహించారని తెలుస్తోంది.

దీంతో ఈ ఫలితాలను నేతల ముందు పెట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో ఆ సర్వే ఫలితాలు ఎలా ఉంటాయో అన్న గుబులు గులాబీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో పాటు ఇటీవల పార్టీలో కొందరు నేతలపై వస్తున్న వలస ప్రచారానికి సంబంధించిన అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి పార్టీలోని కొంతమంది నేతలకు ఆఫర్లు వస్తున్నాయనే వార్తల నేపథ్యంలో ఆ లిస్టులో ఉన్నవారితో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడతారన్న చర్చ సైతం పార్టీలో సాగుతోంది.

To Top

Send this to a friend