కేసీఆర్ సక్సెస్, చంద్రబాబుకు నీటి గండం….

 

తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఎన్నికైన తొలి ఏడాదే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. కానీ దీనిపై ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వవద్దని కేంద్రానికి లేఖ రాశారు. ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా సుప్రీంలో కేసు వేశారు. అనంతరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు దక్కకుండా  ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో తన పరపతిని ఉపయోగించి ఇన్నాళ్లు వాయిదా వేయించారని ఢిల్లీ వర్గాలు కోడైకూశాయి.

కానీ కేసీఆర్ ఊరికే ఉండలేదు. అధికారులు, ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులను కేంద్రంలోని శాఖల వద్ద మోహరించారు. కాళేశ్వరంకు అన్ని అనుమతులు పొందేందుకు అధికారుల బృందాన్ని పంపారు. పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణలోని మిగతా చోట్ల అడవులను పెంచుతామని హామీ ఇచ్చారు. ఇలా సామధానబేధా దండోపాలయాలు ప్రయోగించి కేసీఆర్ ఎట్టకేలకు సాధించారు. తెలంగాణ ఏర్పడ్డ మూడోఏడాదికి కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకానికి అనుమతులన్నీ సాధించారు. వచ్చే 2018లోపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకుపోతున్నారు.

ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదుల్లో నీరు కిందకు రావడం లేదు. పైన మహారాష్ట్ర, కర్ణాటకలు భారీ డ్యాంలు కట్టి నీటిని వారి వ్యవసాయ, తాగునీటి అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో చుక్క నీరు కిందకు రాక తెలంగాణ, ఏపీల్లోని ప్రాజెక్టులు వెలవెల బోతున్నాయి. తాగు, సాగు నీరు లేక బీడు భూములు, ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాణపదమైంది ప్రాణహిత నది. ఇది గోదావరి ఉపనది.. దీని ద్వారానే పెద్ద ఎత్తున నీరు గోదావరిలోకి వస్తోంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు గోదావరిలో కలుస్తుంది. అందుకే ఈ నీటిని ఒడిసి పట్టేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులు కడుతున్నారు.

కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులకు అనుమతులు పొందడంతో ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబులో కలవరపాటు మొదలైంది. కాళేశ్వరం నిర్మాణం పూర్తయితే ఏపీకి నీటికొరత అనివార్యం. ప్రస్తుతం గోదావరి జలాలను వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కడుతోంది. దీని ద్వారానే ఏపీ సాగు , తాగు అవసరాలు తీరుతాయి. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీరు రాక పోలవరం ప్రాజెక్టు వట్టిపోతుంది. అందుకే ఎంత ఆపుదామని ప్రయత్నించినా కేసీఆర్ కాళేశ్వరంకు అన్ని అనుమతులు తెచ్చుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబుకు భంగపాటు ఎదురైనట్టు అయ్యింది.

To Top

Send this to a friend