కేసీఆర్ కు భయపడి.. రేవంత్ ను తొక్కేస్తున్నారా.?


అక్కడున్నది కేసీఆర్.. అప్పటివరకు విశృంఖలంగా సాగిన మీడియా వ్యవస్థపై తెలంగాణ వచ్చాక కేసీఆర్ నియంత్రణ తీసుకొచ్చారు. అప్పటివరకు ఎవరిపై పడితే వారిపై ఇష్టానుసారంగా వార్తలు ప్రచురించిన మీడియాపై నిషేధం విధించారు.. తన వ్యతిరేక మీడియాపై నిషేధంతో కేసీఆర్ పగ సాధించారు. ఇప్పుడు తెలంగాణలో మీడియాను కేసీఆర్ మేనేజ్ చేస్తున్నాడనంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఓటుకు నోటు, నయిం , గ్యాంగ్ స్టర్ ల ఎన్ కౌంటర్ లు, ఏసీబీ దాడులు ఇలా అన్ని విభాగాలను ప్రయోగిస్తూ మీడియాను కూడా కేసీఆర్ నియంత్రణలోకి తెచ్చుకున్నారంటున్నారు. అందుకే ప్రస్తుతం మీడియాకు కేసీఆర్ చెప్పింది వార్త.. చేసింది సంచలనంగా మారింది. ప్రస్తుతం కేసీఆర్ ను తిట్టిన వార్తలు తెలంగాణ మీడియాలో ప్రముఖంగా రావడం లేదు. కేవలం సునిశిత విమర్శలనే వేరే యాంగిల్ లో ప్రతికలు, చానాళ్లు ప్రసారం చేస్తున్నాయి. కేసీఆర్ కు భయపడి తెలంగాణ మీడియా ఆయన పాదాక్రాంతం కావడమో లేక మిన్నకుండిపోవడమో చేస్తున్నారని జర్నలిస్టులు మిత్రులు వ్యాఖ్యానిస్తున్నారు..

తెలంగాణలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కూడా మీడియాలో అప్రకటిత నిషేధం కొనసాగుతుందా?. అంటే అవునంటున్నారు విశ్లేషకులు. గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి మొదలుకుని తెలంగాణ టీడీపీ నేతలు చేసే ప్రకటనలు, కార్యక్రమాలకు అసలు మీడియాలో ఏ మాత్రం ప్రాధాన్యత రావటం లేదు. ఈ విషయంలో తెలంగాణ టీడీపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద స్కాంగా చెబుతున్న మియాపూర్ భూ కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ కుంభకోణంలో ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కారు నంబర్ తో సహా పలు వివరాలు వెల్లడించి కావాలంటే సీసీ టీవీ ఫుటేజీ కూడా చూడొచ్చని అన్నారు. అంతే కాదు సీఎం కెసీఆర్ కు సంబంధించిన బంధువుల మీద ఆరోపణలు చేశారు. నిజానికి ఈ స్కామ్ తెలంగాణలో పెద్ద కలకలమే రేపుతోంది. కానీ రేవంత్ మాటలకు మీడియాలో ప్రచురణకు నోచుకోవటం లేదు.

ఎప్పుడైనా వచ్చినా ప్రభుత్వానికి మరీ వ్యతిరేకంగా ఉన్న అంశాలను తొలగించి…అలా లైట్ గా వదిలేస్తున్నారు. సహజంగా పత్రికలు అయినా..చానళ్ళు అయినా ప్రతిపక్షాల వాయిస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం చేసే మంచి పనులూ చెప్పాలి. దీనిలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ గా సాగుతోంది. ప్రభుత్వానికి బాకా ఊదుతూ ప్రతిపక్షాలు చెప్పే మాటలకు మీడియా కనీస ప్రాధాన్యత ఇవ్వటం లేదనే టీ టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవని చెబుతున్నారు. తెలంగాణలోని టీడీపీ నాయకులు అందరూ ఇంచుమించు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి పరిస్థితి అయితే మరింత దారుణం.

To Top

Send this to a friend