కేసీఆర్ ఎత్తుగడకు చిత్తు కావాల్సిందే.. 

తెలంగాణ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ లో కేసీఆర్ ఆమోదించేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను పొందారు. కేంద్రం కోర్టులోకి ఈ వివాదాన్ని నెట్టారు. ఆమోదించకుంటే బీజేపీని టార్గెట్ చేస్తారు. తాను రిజర్వేషన్లపై ముందుకెళ్లాను కానీ బీజేపీయే అడ్డుకుందని చెపుతారు. అంతిమంగా ఇది కేసీఆర్ కు మేలు చేసేదిగా.. బీజేపీకి శరాఘాతంగా మారింది. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీకి కేసీఆర్ భస్మాసుర హస్తాన్ని చాటారు. రిజర్వేషన్ కోటా మీద సైతం చెయ్యేసి.. కేంద్రంతో కూడా కొట్లాటకు దిగేశారు. అయితే అక్కడే సమాధానం చెప్పుకోవాల్సిన కొన్ని చిక్కుప్రశ్నలూ ఉంటాయి.

తెలంగాణాలో 90 శాతం ప్రజలు సామాజిక వెనుకబాటుతనంతో సతమతమవుతున్నారు కాబట్టి రిజర్వేషన్లు పెంచి తద్వారా వారికి ఉద్యోగ-విద్యావకాశాల్ని మెరుగుపరచాలన్నది కేసీయార్ నిర్ణయం. రాజ్యాంగం ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న నియమాన్ని సైతం కేసీయార్ సవాల్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో వున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే రిజర్వేషన్ల శాతం వుండాలితప్ప దేశమంతా ఒకే గాటన కట్టి రూల్స్ రూపొందించడాన్ని ఆయన తప్పబట్టారు. అంతేకాదు.. తమిళనాట వున్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల నిబంధనలకు సడలింపు ఇచ్చినట్లే తెలంగాణాకు కూడా ఇవ్వాలన్నది ఆయన డిమాండ్ ! ఈ విషయంలో ఒకవేళ కేంద్రం కాదంటే సుప్రీంకోర్టుకైనా వెల్లి పోరాడతామంటూ సవాల్ కూడా విసిరారు.

కేసీయార్ విధాన నిర్ణయాల్ని తీసుకోవడంలో సాధారణంగా భయపడరు. వాటిని ప్రకటించడంలో సైతం దూకుడుగా వ్యవహరిస్తారు. తాను అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాల్ని సైతం అంతే అందంగా లెక్కలతో సహా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్షాల అభ్యంతరాలను బేఖాతర్ అంటారు. అదీ ఆయన స్పెషాలిటీ ! రిజర్వేషన్లను పెంచే విషయంలో ఎవరి అభ్యంతరాలు ఎలా వున్నా.. కేసీయార్ బుధవారం నాడు క్యాబినెట్ భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రిజర్వేషన్ల వ్యవహారాలపై స్పందించిన తీరును, ఆయన నిర్ణయాత్మక శైలిని.. సంభాషణా చాతుర్యాన్ని మెచ్చుకోక తప్పదు. ఇకపోతే. సామాజిక అంశాలపై స్పందించే ఆర్థిక నిపుణులను ఆయన తప్పబట్టారు. అమర్త్యసేన్ వంటి వ్యక్తుల తీరును దుయ్యబట్టారు. కొన్ని వర్గాలకు లాభాలను పంచడం తప్పనే ఆర్థికవేత్తల మాటల్ని ఆయన తోసిపుచ్చారు. ఆకలేసే కడుపుకు అన్నం పెట్టడం.. గుక్కెడు నీళ్లు లేక దాహమంటూ అరుస్తున్న గొంతులకు నీళ్లివ్వడం ప్రధానమన్నారు కేసీయార్.

కేసీఆర్ వాదనలో సహేతుకత ఎంతన్న మాట అటుంచితే.. రాష్ట్రాలకు హక్కులుంటాయని.. పరిస్థితులకు అనుగుణంగా కాలం చెల్లిన చట్టాలను మార్చాలన్న గట్టి మాట వినిపిస్తుంది. కేంద్రం పోకడల్ని, పెత్తందారీతనాల్ని ప్రశ్నించే శక్తి కనిపిస్తుంది. ఆయన్ని వ్యతిరేకించేవారు సైతం ఆయనలోని ధిక్కారథోరణిని సమర్ధించే పరిస్థితి. ముస్లిములకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ ఇప్పటికే కేసీయార్ ని విమర్శిస్తోంది. మిగతా రాజకీయ పక్షాలు కేసీయార్ రిజర్వేషన్ల విధానాన్ని తప్పపట్టే సూచనలు లేవు. బీసీ కమిషన్ కు అధికారిక హోదా ఇవ్వడం పట్ల కేసీయార్ ని తప్పుపట్టే అవకాశం ఎక్కడ? మాదిగ దండోరా అడుగుతున్న ఎస్సీ వర్గీకరణను కేసీయార్ సమర్ధిస్తున్న తీరును ఇతర రాజకీయ పక్షాలు విభేదించే పరిస్థితి ఎక్కడ ? అయితే.. స్వాతంత్యం వచ్చిన దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా సామాజిక ప్రాతిపదిక మీదే రిజర్వేషన్లు కొనసాగుతున్నవైనం పట్ల జనంలో అభ్యంతరాలున్నాయి. రిజర్వేషన్లను కేవలం సామాజిక వెనుకబాటు ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదిక మీద మాత్రమే ఇవ్వాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్న కాలమిది ! కేసీయార్ చెపుతున్న90 శాతం వెనుకబాటువర్గాలున్న తెలంగాణా సమాజంలో రిజర్వేషన్ల ద్వారా ఆయా తరగతులకు విద్యాఉద్యోగ అవకాశాల్ని పెంచడం తప్పెలా అవుతుందన్న ప్రశ్న వుండనే వుంది. కాకపోతే.. తరాలకు తరాలు తమ సామాజిక వర్గ ప్రాతిపదికనే రిజర్వేషన్లను అనుభవిస్తూ క్రీమీలేయర్ కు ఇంకా ఎన్నాళ్లు అటువంటి హోదా ఇవ్వాలన్న వాదనలకు కేసీయార్ సమాధానం ఏమిటి?

మొత్తంగా కేసీఆర్ రాజకీయంగా చాలా పెద్ద ముందడుగు వేశారు. తెలంగాణ రిజర్వేషన్లను పెంచేలా ప్రతిపాదనలు చేసి ఆయా వర్గాలకు ఊరట కల్పించారు. అది ఆమోదం పొందినా పొందకపోయిన తెలంగాణ సమాజంలో మంచి మార్కులు కొట్టేశారు. ఇది ప్రత్యర్థి బీజేపీకి, కాంగ్రెస్ కు మైనస్ గా మారిపోనుంది.

To Top

Send this to a friend