పోలీసులతో కేసీఆర్ భేటి వెనుక రహస్యం..

ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షే త్రస్థాయిలో ఏం జరుగుతుందో.. ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారో.. ఎవరు ఎంత నొక్కేస్తున్నారో కేసీఆర్ తెలుసుకోవాలనుకున్నారు. అందుకే అర్జంట్ గా పోలీసులతో ములాఖత్ ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రహస్యంగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. . మండల కేంద్రాల్లో పనిచేస్తూ.. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణను ప్రత్యక్షంగా పర్యవేక్షించే ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల (సీఐల)కు నేతల వ్యవహారాలపై సమాచారం ఉంటుందని.. అందువల్ల వారి నుంచి వివరాలన్నీ తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగనున్న పోలీసు కాన్ఫరెన్స్‌ను వేదికగా చేసుకోనున్నట్లు తెలిసింది. గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు చేస్తున్న దందాలపై నేరుగా పోలీసు అధికారుల నుంచే ఆరా తీయడంతోపాటు… ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనేదీ తెలుసుకోనున్నట్లు సమాచారం.

నేతల అవినీతి అక్రమాలతో పాటు కొత్త జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితులు, భవనాల నిర్మాణం, సమస్యల పరిష్కారానికి మార్గాలపైనా చర్చించారు..  అయితే పోలీస్‌ కాన్ఫరెన్స్‌కు కేవలం శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న అధికారులనే ఆహ్వానించడంపై పోలీసు శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాంతిభద్రతలకన్నా కీలకమైన విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని కూడా పట్టించుకోకపోవడం ఆయా అధికారుల్లో నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది.  కానీ సీఎం తెలుసుకోవాలనుకుంటున్న నేతల అవినీతి అక్రమాలు, అభివృద్ధి పనుల్లో అవినీతి వ్యవహారాలు వీరికే తెలుస్తాయి కాబట్టి కేసీఆర్ వారినే భేటికి పిలిచారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

To Top

Send this to a friend