కేసీఆర్ కు ముద్రగడ..


ఒక రాష్ట్రంలో ఒక సామాజికవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాడుతున్న నేత.. అదే ఉద్యమాల్లో ఆరితేరి తెలంగాణ సీఎంగా ఎన్నికైన నాయకుడికి అరుదైన లేఖ రాశారు. అందులో సొంత రాష్ట్రం సీఎంను తిడుతూ పక్కనున్న కేసీఆర్ ను వేయినోళ్ల పొగిడారు. ఏపీ విభజనకు కారుకుడైన కేసీఆర్ కు ఆంధ్ర నేతలు, ప్రజల్లో అభిమానం పెరుగుతుందనడానికి ఇదో ఉదాహరణ..

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ అరుదైన , ప్రశంసలతో కూడా లేఖ రాయడంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం రేపింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ముద్రగడ పద్మనాభం ప్రశంసలు కురిపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నెరవేర్చారని.. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు లేకుండా చేయడమనేది చాలా మంచి విషయమని కేసీఆర్ ను ముద్రగడ లేఖలో అభినందించారు.

ఇక సుప్రీం కోర్టు న్యాయమూర్తి అన్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలు చిత్తుకాగితాలు కావని దేశంలోనే కేసీఆర్ మాత్రమే నిరూపించారని ముద్రగడ ఆకాశానికెత్తేశారు. ఎస్టీలు, ముస్లింలు, బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం చూస్తుంటే అణగారిన వర్గాల కోసం కేసీఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తున్నారనే విషయం అర్థం అవుతోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసి దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అని కేసీఆర్ పేరుతెచ్చుకున్నారన్నారు. ఖర్చు లేని ఎలక్షన్లు తెచ్చి ప్రజల గుండెల్లో పేరు తెచ్చుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనకు అభినందలు అని అభినందించారు.

ఓ పక్క కేసీఆర్ నమ్మి ఓట్లు వేసిన ఓటర్లను గౌరవిస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం హామీలను నెరవేర్చాలని కోరితే.. లాఠీలతో కొట్టించడం.. అక్రమ కేసులు పెట్టి బాధించడం.. చేస్తున్నారని ఏపీ సీఎంను తూర్పార పట్టారు. పదవులు , ఆస్తులు, జీవితాలు శాశ్వతం కాదని.. పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని చంద్రబాబుపై మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి కోట్లు ఖర్చు చేసే విధానం పాటించవద్దని కేసీఆర్ కు సూచించారు.

ఏపీ కాపు ఉద్యమనేతగా కొనసాగుతున్న ఓ నేత ఇలా ఏపీ విడిపోవడానికి కారణమైనే కేసీఆర్ పాలనను మెచ్చుకోవడం ఏపీలో కాకరేపుతోంది. ఈ కీర్తి చంద్రబాబుకు ఇబ్బందిగా మారగా.. కేసీఆర్ కు మైలేజ్ సాధించిపెట్టింది. పాలనలో కేసీఆర్ ను చంద్రబాబు అందుకోవడం లేదని తేటతెల్లమైంది.

To Top

Send this to a friend