కేసీఆర్ కు ఎదురొడ్డి.. ఒంటరిగా బరిలోకి..


తెలంగాణలో కేసీఆర్ సూపర్ ఫాంలో ఉన్నారు.. ఆయనను ఎదురొడ్డి నిలిచే శక్తి ప్రస్తుతం తెలంగాణలోఎవరూ లేరు.. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టీడీపీనే కేసీఆర్ ధాటికి కుదేలైంది.. రేవంత్ రెడ్డి మినహా దిగ్గజ నాయకులందరూ గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కకావికలమైన టీడీపీని బతికించడం సాధ్యం కాదని తెలిసే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటువైపు చూడడమే మానేశాడు. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.

కానీ కేంద్రంలో అండ చూసుకొని చెలరేగిపోతున్న కమళనాథులు తెలంగాణలో పాగా వేయాలని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని.. మా బాహుబలి మోడీయేనని ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని తెలిపారు..

ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ కు ఎదురొడ్డి.. ఆయన్ను ఢీకొనడం బీజేపీకి, ముఖ్యంగా నాయకత్వ లేమి కునారిల్లుతున్న బీజేపీ అసాధ్యమనే చెప్పాలి. బీజేపీలో సరైన నాయకుడు లేడు. బీసీ నేత లక్ష్మన్ ను అధ్యక్షుడిని చేసినా.. అంతకుముందు కిషన్ రెడ్డి ని అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా ఏమాత్రం పార్టీ పుంజుకోవడం లేదు. ఇప్పుడు యూపీ విజయంతో ఇక్కడా పాగా వేయాలని అమిత్ షా అండ్ కో ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ దక్షిణాది జనాలకు, ఉత్తరాది జనాలకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలనే జనం నమ్ముతారు. పైగా పెద్దనోట్ల రద్దు తో కర్రు కాల్చి వాత పెట్టిన బీజేపీపై జనం రగిలిపోతున్నారు. ఈ గాయాలకంటే పెద్ద గాయాలే యూపీలో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి పట్టం కట్టారు. కానీ తెలంగాణలో బలమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఉండగా.. బీజేపీకి అధికారం కల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend