కారు చీకట్ల నుంచి.. కాంతిరేఖల దాకా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని హెచ్చరించాడు. సచివాలయంలో మీటింగ్ పెట్టి కర్రతో మాస్టారులో తెలంగాణకు సంభవించే కరెంట్ కొరత, ప్రాజెక్టులకు నీటి కొరత అనివార్యమంటూ గూగుల్ మ్యాప్ ల ద్వారా వివరించారు. కిరణ్ మాటలకు తెలంగాణ సమాజం, ఉద్యమకారుల్లో కూడా ఒకింత భయాందోళన వ్యక్తం అయ్యింది.. నిజంగానే తెలంగాణ వస్తే కరెంట్ లేక కారు చీకట్లు కమ్ముకుంటాయా..? ప్రాజెక్టుల్లో నీటి పంపకాల లొల్లితో నీటికొరత ఏర్పడుతుందా.? తెలంగాణ 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందా అన్న ఆందోళన.. కానీ ఇప్పుడది లేదు..

తెలంగాణ తొలి ఉషోదయాన్ని చూసిన మరుక్షణం పగ్గాలు చేపట్టిన కేసీఆర్ మొదట ఎదుర్కొన్నది కరెంట్ సమస్యను. ఆ తర్వాత నీటి లొల్లిని.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ ఏపీలోనే ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు కరెంట్ కట్ చేశాడు. ఖమ్మం జిల్లాలోని సీలేరు ప్రాజెక్టును కూడా కేంద్రం సాయంతో లాక్కొని ఆ కరెంట్ ను తెలంగాణకు ఇవ్వలేదు. దీంతో ఇంటా బయట కరెంట్ కొరతతో మొదటి ఏడాది తెలంగాణలో నిజంగానే కారుచీకట్లు కమ్ముకున్నాయి. కేసీఆర్ పై విమర్శలు వచ్చాయి. ఏపీ నాయకులు చెప్పింది నిజమవుతుందా అని తెలంగాణ సమాజంలో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆ తర్వాత పట్టుదలతో కేసీఆర్ ప్రయత్నించారు. కోట్లు ఖర్చు చేశారు. విద్యుత్ లైన్లు వేయించారు. ఎక్కడ దొరికితే అక్కడ కరెంట్ కొన్నారు. రెండేళ్లు తిరిగేసరికి సాగుకు, ఇంటి అవసరాలకు కరెంట్ కొరత తీరింది. గృహాలకు, పరిశ్రమలకు 24గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది గ్రిడ్ లైన్ పూర్తయి తెలంగాణకు దేశంలో ఎక్కడి నుంచైనా కరెంట్ కొనే వీలు కలిగింది. తద్వారా ఈ మూడో ఏడాది తెలంగాణ రైతాంగానికి తీపి కబురునందించింది కేసీఆర్ ప్రభుత్వం.

ఎన్నో ఏళ్ల నుంచి రాత్రి కరెంట్ తో అర్ధరాత్రి పోయి కరెంట్ పెట్టే తెలంగాణ రైతాంగానికి ఈరోజు ఎంతో శుభదినమే.. నేటినుంచి తెలంగాణ ప్రభుత్వం 24 గంటల త్రీఫేస్ కరెంట్ ను రైతులకు ఇచ్చేందుకు సమాయత్తమైంది. ఉత్తర భారతదేశం నుంచి విద్యుత్ లైన్ నిజామాబాద్ జిల్లాకు కనెక్ట్ విటీ అయిపోవడంతో ఇప్పుడు మనకు కావాల్సినంత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎన్నో కోట్లు ఖర్చు చేసైనా తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులకు నిరంతర విద్యుత్ అందించేందుకు సిద్ధమయ్యారు. మొదటగా ఆదివారం అర్థరాత్రి నుంచే ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సెప్టెంబర్ తర్వాత వచ్చే రబీసీజన్ కు 24 గంటల కరెంట్ ను తెలంగాణ మొత్తానికి రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది..

తెలంగాణ పడి లేచిన కెరటం.. కరెంట్ కష్టాలతో ఎప్పుడు ఉంటుందో ఉండదో అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు 24 గంటల కరెంట్ సరఫరా చేసే దాకా ఎదిగింది. నిజంగా ఇది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయం.. తెలంగాణ రైతాంగానికి ఈరోజు పండుగరోజు. దశాబ్ధాల కరెంట్ కష్టాలకు చరమగీతం పాడి నవకాంతులు వెదజల్లుతున్న ఈరోజు ఓ చరిత్రాత్మకం..

To Top

Send this to a friend