కాంగ్రెస్ శ్రవణ్ కు షాక్ ఇచ్చిన కేటీఆర్

త‌న‌ను టీఆర్ఎస్ టార్గెట్ చేసి వేధిస్తుంద‌ని, ఉద్య‌మం చేసిన న‌న్ను మోసం చేసింద‌ని, టీఆర్ఎస్ తాను ఉన్న‌ప్ప‌టి ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తుంద‌ని అంటూ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ బ‌హిరంగ లేఖ ఒక‌టి మంత్రి కేటీఆర్ కు రాశాడు. దానికి కౌంట‌ర్ గా టీఆర్ఎస్ ఇచ్చిన స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయి చ‌క్క‌ర్లు కొడుతుంది. ఆ లేఖలో ఇలా రాసుకొచ్చారు…

‘‘*దురాశ దుఃఖానికి చేటు శ్రవణ్ దాసోజు అన్నా!

నిజమే. తెలంగాణ ఉద్యమంలో నీవంతు పాత్ర పోషించినవ్. కానీ వంట అయిపోయి వడ్డించేలోపలే ఆత్రపడి జీవితాన్ని ఆగం చేసుకున్నవ్. కేవలం టికెట్ ఇయ్యలేదన్న ఒక్కటే కారణంతో నిన్ను అమ్మలాగా ఆదరించిన టీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచి ఎన్నికల ముందు కాంగ్రెస్‌ల జేరినవ్. పోనీ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు అక్కడన్నా టిక్కెట్ సంపాదించినవా అంటే అదీ దక్కలే నీకు. ముసలి పులి బంగారు కడియం ఇస్తానని దగ్గరికి పిలిచి గుటుక్కున మింగినట్టు, నమ్మించి నీ గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. మరెందుకన్నా అంత పిచ్చి నిర్ణయం తీసుకున్నవ్? తీరా ఎలెక్షన్లు అయిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డంక నువ్వు నీ పాత ఉద్యమ మిత్రుల దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డవ్. “ఆ క్షణాన నా నెత్తి మీద దయ్యం కూసుంది. అందుకే ఇంత పిచ్చి పని చేసిన” అని ఈ మూడేండ్లలో నువ్వు ఎన్ని మార్లు బాధపడలేదు అన్నా? తిరిగి పార్టీలోకి వస్తా అని ఎన్ని సార్లు రాయబారాలు పంపలేదు అన్నా?

తెలంగాణను ఆంధ్రల కలిపి, ఆరు దశాబ్దాలు అరిగోస పెట్టి వేలాది మంది బిడ్డల ఉసురుబోసుకున్న కాంగ్రెస్ గొడుగు కింద కూసొని ఒకటే పిచ్చి ఒర్లుడు ఒర్లుతున్నవ్.

అన్నా! నువ్వు ఆ రోజు ఎన్నికల టైములో భువనగిరి నుండి పోటిచేస్తా అన్నది నిజమే. కానీ కేసీఆర్ గారు “శ్రవణ్, మనకు కొన్ని జిల్లాలలో పెద్దగా బలం లేదు. మరీ ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో కొంచెం టఫ్ ఉంటది. మనకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి. ప్రతి సీటు ముఖ్యమే. అయినా నువ్వు భువనగిరి నుండి పోటీ చేద్దామని అనుకున్నోనివి ఒక్క రోజన్నా అక్కడ స్థానికంగా పని చేయకపోతివి. నువ్వు నిలబడితే అక్కడ గెలుసుడు కష్టం. ఈ మాట నీ ఒక్కనికే కాదు. భువనగిరి నుండి 14 ఏండ్లుగా పార్టీకొరకు కష్టపడుతున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి కూడా అక్కడ గెలుసుడు కష్టమని మన సర్వేల తేలింది. జర ఓపిక బట్టు మన పార్టీనే అధికారంలకి వస్తది. వచ్చినంక కర్నె ప్రభాకర్‌కు, ఎలిమినేటి కృష్ణారెడ్డికి, నీకు అందరికీ సముచితమైన స్థానం ఇస్తా.” అని అన్నడు.

ఆరోజు మీరు, కర్నె ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి ముగ్గురూ బాధపడ్డరు. కాని కర్నె ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి మీలెక్క ఆత్రపడలేదు. వారిద్దరు తమ ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలు ముఖ్యమనుకున్నరు. బాధ దిగమింగుకొని పార్టీ అభ్యర్దుల గెలుపు కోసం కృషిచేసిండ్రు.

జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే సరిగ్గా మూడు నెలలు తిరగక ముందే మీ సహ ఉద్యమకారుడు కర్నె ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ చేసి ఘనంగా సత్కరించిండు ముఖ్యమంత్రి కేసీఆర్. అదీ ఉద్యమకారుల పట్ల ఆయన నిబద్ధత అంటే.

మొన్న మార్చి నెలలో సీనియర్ పార్టీ నేత, భువనగిరి నియోజకవర్గంలో పదిహేడేళ్లు పార్టీ కొరకు కష్టపడ్డ ఎలిమినేటి కృష్ణారెడ్డిని ఎమ్మెల్సీ చేసి, పార్టీ కొరకు, ఉద్యమంలో పాటుపడ్డ అందరినీ తాను గుర్తు పెట్టుకుంటాననే సందేశం స్పష్టంగా ఇచ్చిండు కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో.

ఒకసారి ఊహించుకో శ్రవణ్ భాయ్. వారిద్దరి ప్రవర్తనకు, నీ ప్రవర్తనకు ఎంత తేడా ఉన్నదో అర్థమవుతోందా? ఎక్కడైనా విశ్వసనీయత ముఖ్యం అన్నా. నాయకుని మీదా, పార్టీ మీదా నమ్మకం ఉండాలె. ఆ నమ్మకంతో ఉండబట్టే మనకు తెలంగాణ సిద్దించింది? నీ లెక్క రెండు మూడేళ్లకే టికెట్ దక్కలేదని పార్టీలు మారుకుంట ఉండే లీడర్లు ఉంటె ఎన్నటికీ తెలంగాణ రాకపోతుండె కదన్నా. నువ్వియ్యాల టీఆర్ఎస్ ల ఉండి ఉంటే నీ స్థానం ఎంత ఉన్నతంగా ఉంటుండె? పార్టీ నిన్ను నెత్తిన పెట్టుకుంటుండె. కానీ కేవలం టికెట్ ఇయ్యలేదన్న ఒక్క కారణంతోని నువ్వు టీఆర్ఎస్ మీద విషం చిమ్ముతుంటే, జనం నవ్వుతున్నరు శ్రవణ్ అన్నా.

మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ – బిడ్డ ఇందిరా గాంధీ – కొడుకు రాజీవ్ గాంధీ -భార్య సోనియా గాంధీ అధ్యక్షురాలిగా, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూసొని నువ్వు కేసీఆర్ మీద కుటుంబ పార్టీ అని ఆరోపణ చేస్తే జనం నవ్వుతున్నరన్నా. రాచరికపు పోకడలతో డెబ్భై యేండ్లుగా ఒకటే కుటుంబం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నీకు అసలు ఈ వ్యాఖ్య చేసే అర్హత కూడా లేదని గుర్తుపెట్టుకో

అయినా మూడేండ్ల సంది కాంగ్రెస్ పార్టీల నువ్వు ఎంత గింజుకుంటున్నవో, అక్కడ నీకు కనీస గౌరవం కూడ దక్కుతలేదో అందరు చూస్తనే ఉన్నరు. ఆడ అంతో ఇంతో ధ‌మాక్ ఉన్న నేత‌వు నీవె అంట‌రు .. కానీ నిన్ను ఎవ్వ‌రు దేకుత‌లేరు. నువ్వు ఈ మ‌ధ్య ఈ విష‌యాన్ని నీ దోస్తుల తోని జెప్పుకున్న‌వంట‌.

ఇక్కడ తెలంగాణల నన్ను బతకనీయరు ఈ కాంగ్రెస్ వృద్ధ జంబూకాలు. కనుక డిల్లీలో ఏదైనా పదవి చూసుకోవాలె” అని కూడా అనుకుంటున్నవట. కష్టపడి పనిచేసేటోల్లకు చివరికి కాంగ్రెస్ పార్టీలో పట్టే గతి అదేనన్నా. ఇంకో ముచ్చట కూడ చెప్పాలె నీకు. నువ్వు 2014 చేసిన తప్పే మల్ల మల్ల చేస్తున్నవ్. ఇప్పటికీ నీకు ఒక నియోజకవర్గం లేదు. మల్ల 2019 కూడా కాంగ్రెసోల్లు నీకు మొండిచెయ్యే చూపుతరు. అండ్ల ఏం డౌట్ లేదు. కనీసం ఇప్పటికన్నా ఆత్మపరిశీలన చేసుకో. కాంగ్రెస్ పార్టీల ఉండి నువ్వు తెలంగాణకు ఎన్నడూ ఏమీ మేలుచేయలేవు. నీతోని ఏం గాదు అన్న‌ది అక్ష‌ర స‌త్యం.’’

To Top

Send this to a friend