ఫోన్ ఎట్లా ఎత్తుతాడు.. కేసీఆర్..


అధికారంలో ఉన్నవాళ్లకు దాన్ని కాపాడుకోవడం అత్యంత అవశ్యం.. దానికోసం శత్రువులను కూడా మిత్రులనుకోవాలి.. కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే పెండల పురుగును కూడా ముద్దుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ అడుగులు అట్లానే ఉంటాయి.

కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. కేంద్రంనుంచి తెలంగాణకు సాయం అవసరం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అంటకాగని తప్పని పరిస్థితి. అట్లా ఉంటేనే నిధులు, పనులు అవుతాయి. అధికారంలో ఉన్న ఎవ్వరైనా సరే.. ఇదే పాటిస్తారు.. ప్రతిపక్షంలోని కాంగ్రెస్ తో వెళితే ఏమవుతుంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ విషయం తెలుసు కనుకే.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని కేసీఆర్ బీజేపీతో చెలిమి చేస్తున్నారు..

ఒక్కరోజు తేడాతో బీజేపీ, కాంగ్రెస్ తరఫున నిలబడ్డ రాష్ట్రపతి అభ్యర్థులు కోవింద్, మీరాకుమార్ లు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. అధికార బీజేపీ అభ్యర్థి కోవింద్ కు టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ నేతలు సాగిలపడ్డారు. కేసీఆర్ ,జగన్, చంద్రబాబులు కోవింద్ ను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి మీరాకుమార్ ను ఈ నేతలు కలవడమే మానేశారు. ఎందుకంటే బీజేపీకి మద్దతు ప్రకటించారు కాబట్టి..

కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ .. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మద్దతు కోరేందుకు ఫోన్ చేశారు. కానీ ఇప్పటికే బీజేపీకి మద్దతిచ్చిన కేసీఆర్ మీరాకుమాన్ ను కలిసేందుకు ఒప్పుకోలేదు. అందుకే ఫోన్ కు స్పందించలేదు. అందులో న్యాయం ఉంది. ఒకరికి మద్దతిచ్చి మరొకరితో వెళితే ఉన్న స్నేహం.. మాట పోతుందని కేసీఆర్ అలా చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులకే ఇది తప్పుగా అనిపించింది. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన మీరాకుమార్ ను కేసీఆర్ కలవకపోవడంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. మీరాకుమార్ ను అవమానించారని ఆడిపోసుకున్నారు. కానీ కేసీఆర్ చేసింది న్యాయం.. పండ్లున్న చెట్టుతో ఉంటేనే ఆకలి నిండుతుంది. ఎండిన చెట్టుతో వెళితే కడుపు మండుతోంది. ఈ స్ట్రాటజీ తెలిసి కేసీఆర్ తెలివిగా వ్యవహరించారు. ఆయన్ను విమర్శించి కాంగ్రెస్ తేలిపోయింది.

To Top

Send this to a friend