ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

కేసీఆర్ స్ట్రాటజీయే వేరు.. ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా తనకు ఉపయోగపడితేనే తీసుకుంటారు. తెలంగాణలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేసే మరో పెద్ద నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో లబ్ధి పొందని కుటుంబం అంటూ ఉండదు. ఇలా ఓట్లతో పాటు ప్రజాభిమానాన్ని చూరగొనడంలో కేసీఆర్ మరో భారీ స్టెప్ జనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

*బతుకమ్మకు కేసీఆర్ గిఫ్ట్..
తెలంగాణలో బతుకమ్మ పెద్ద పండుగ.. ఈ పండుగను క్యాష్ చేసుకోవాలని తద్వారా జనంలో క్రెడిట్ కొట్టేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ అత్యంత ప్రధానమైనది. సంస్కృతీ… సంప్రదాయాలు ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పూల పండుగను పురస్కరించుకుని మహిళలను గౌరవించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ చీరలు కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ముస్లింలకు రంజాన్, కైస్త్రవుల కోసం క్రిస్మస్ పండుగ రోజున బట్టలను కానుకగా అందించారు. బతుకమ్మ పండుగ కోసం మహిళలకు చీరలను కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. సెప్టెంబర్ మాసంలో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల నాటికి మహిళలకు చీరల పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

*రేషన్ కార్డుల ద్వారా చీరల పంపిణీ
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరలను కానుకగా అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటిని రేషన్ కార్డుల లెక్కన అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం గతంలో ఉన్న రేషన్ కార్డులను రద్దుచేసి, వాటి స్థానంలో నూతనంగా మహిళల పేరు మీద ఆహార భద్రత కార్డులను అందజేసింది. ఇందులో హిందూ సంప్రదాయాన్ని పాటించే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి..? జిల్లాకు బతుకమ్మ కానుకగా ఎన్ని చీరలు అవసరం అవుతాయి..? అనే అంశంపై అధికారులు సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆహారభద్రత కార్డుదారులు తమ కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు కులం, ఫోన్ నంబర్లను రేషన్ షాపుల్లో అందజేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని రేషన్ డీలర్లు దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

*చేనేతకు బాసటగా….
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేనేత కార్మికులకు బాసటగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కనీసం వారానికి ఒక్కరోజు సోమవారం అధికారులంతా చేనేత వస్ర్తాలనే ధరించాలని మంత్రి కేటీఆర్ గతంలో సూచించారు. దీంతో చేనేత చీరలను అందించడం ద్వారా వారికి పని కల్పించడమే కాకుండా ఆర్థికంగా చేయూతనిచ్చినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బతుకమ్మకు చేనేత చీరలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. చేనేత కార్మికులు ఎంత మంది మగ్గాలపై చీరలను తయారు చేస్తున్నారు? కార్డుదారులందరికి పంపిణీ చేయడానికి సరిపోతాయా? సరిపోని పక్షంలో ఏయే చర్యలు తీసుకోవాలి? అనే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరిసిల్ల గద్వాల, పోచంపాడులలో ఈ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం వారికి కాంట్రాక్టు, డబ్బులను కూడా ఇచ్చేసింది.

ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేతలకు చేతినిండా పని కల్పించడంతో పాటు తెలంగాణ ఆడపడుచులకు పండుగకు చీరలు పంపిణీ చేయబడతారన్న మాట.. ఇలా కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్లల్ని కొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాడు..

To Top

Send this to a friend