కేసీఆర్ కోపాగ్నికి బలి..

తెలంగాణలో ఉన్న బలమైన పేపర్లు 4. అందులో ఈనాడు రామోజీది, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది. వీరిద్దరూ టీడీపీ సానుభూతిపరులే.. కేసీఆర్ బయట నుంచి మద్దతు ఇస్తున్నవారే.. ఇక సాక్షి పక్కరాష్ట్రం ప్రతిపక్ష నేత జగన్ ది. ఆయన న్యూట్రల్ గా ఏది ఉంటే అదే రాసేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు ఉన్న ఏకైక పత్రిక నమస్తే తెలంగాణ. దాదాపు 7 ఏళ్ల కింద ఉద్యమ సమయంలో ప్రారంభమైన పత్రికపై కేసీఆర్ ఇన్నాళ్లకు దృష్టిసారించారు. దానికి కారణం తన సొంత పత్రిక తన గురించి కాకుండా ప్రతిపక్షాలపై, సీపీఐ, సీపీఎం నాయకులకు అనుకూలంగా వార్తలు రాస్తోందట.. మొన్నటి మొన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు దాన్ని బ్యానర్ చేశారట.. దీంతో చిర్రెత్తికొచ్చిన కేసీఆర్ ఈ మొత్తం పత్రికలో ఎవరిది కీరోల్ అని చూస్తే.. ఆయనే మాజీ నక్సలైట్ అయిన జర్నలిస్టు మార్కండేయ అని తేలింది మార్కండేయ ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రికలో కీలక స్థానంలో ఉన్నారు. న్యూస్ నెట్ వర్క్ ఇన్ చార్జిగా , మఫిసిల్ ఎడిటర్ గా కొనసాగుతున్నాడు. దీంతో రిక్రూట్ మెంట్ నుంచి వార్తల సేకరణ, ఏ వార్త పెట్టాలనేది ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఆయనే రాస్తున్నారని తెలిసి కేసీఆర్ ఆయన్ను తొలగించారు.

తనను తొలగించిన కేసీఆర్ పై యుద్దానికి తెరతీశాడు మార్కండేయ.. తనను తీసేయడానికి కేసీఆర్ చెప్పిన కారణాలు.. తాను చేసిన పనులపై పెద్ద లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు అది వైరల్ అయ్యింది.

‘‘మార్కండేయ రాసిన లేఖను కింద చూడొచ్చు..’’

నమస్తే తెలంగాణ కుటుంబసభ్యులకు, మిత్రులందరికీ నమస్తే..
నన్ను సంస్థ నుంచి పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. నాపై ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు:
1. నేను మాజీ మావోయిస్టును. కనుక సంస్థలోకి మావోయిస్టులను రిక్రూట్ చేస్తున్నాను. మావోయిస్టు వార్తలను మన పేపర్లో పబ్లిష్ చేయిస్తున్నాను.
2. మన పేపర్లో ప్రతిపక్షాల వార్తలు బాగా వచ్చేలా చేస్తున్నాను.
3. రాహుల్ గాంధీ వార్త ఫస్ట్ పేజీలో రావడానికి నేనే కారణం.
4. తెలంగాణ సాయుధపోరాటంపై సినిమా తీస్తానన్న క్రిష్ణవంశీ ఇంటర్వూ జిందగీలో రావడానికి నేనే కారణం.
5. టాబ్లాయిడ్లలో ప్రభుత్వ, అధికారుల వ్యతిరేక వార్తలు, కథనాలు పెట్టిస్తున్నాను.
– ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో మీ అందరికీ బాగా తెలుసు. ఆ విషయం మీ విచక్షణకే వదిలేస్తున్నాను.
– అయితే, నేను చెప్పదల్చుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి.
1. నమస్తే తెలంగాణ పుట్టుక నుంచి మూడు లక్షలకు పైబడిన ప్రింట్ ఆర్డర్కు చేరి ప్రధాన పత్రికగా ఎదిగేవరకూ నా కంట్రిబ్యూషన్ అందరికీ తెలుసు. నెట్వర్క్ ఇన్చార్జిగానే కాకుండా టాబ్లాయిడ్స్ ఇన్చార్జిగా, జర్నలిజం స్కూల్ టీచర్గా, రిక్రూట్మెంట్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాను.
2. తెలంగాణ వచ్చేవరకూ నెట్వర్క్ తో మూడు యాడ్ కేంపెయిన్స్ చేసి రూ. 27 కోట్లు సమకూర్చాను.
3. గత రెండేళ్ల కాలంలోనే నెట్వర్క్ చేత మూడు సర్కులేషన్ కేంపెయిన్స్ చేసి రెండు లక్షల రెండు వేల సంవత్సర చందాలు చేయించాను. ఇటీవలే రికార్డు స్థాయిలో లక్షా 25వేల కాపీలు చేసి పత్రిక సర్కులేషన్ 3 లక్షలు దాటించాను.
4. వార్తల పరంగా ఏ రోజూ వెనక్కి తగ్గిందిలేదు.
5. నా ఆధ్వర్యంలోనే టాబ్లాయిడ్లు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. మనం తలవంచుకునే పరిస్థితి ఏ రోజూ రానివ్వలేదు.
6. మొదటినుంచీ ఎడిటోరియల్ రిక్రూట్మెంట్లో నా పాత్ర ఎంతో అందులో ఎంతమంది మావోయిస్టులున్నారో మీకు బాగా తెలుసు.
7. కొత్త పేపర్ కోసం ఎవరూ ముందుకురాని అననుకూల పరిస్థితుల్లో న్యూస్ నెట్వర్క్ లోకి డెస్క్ లలోకి వివిధ పత్రికల నుంచి అనేక మంది జర్నలిస్టులను తీసుకువచ్చాను.
8. ఎడిటరతో్ సహా మరెవరూ తిరగనంతగా 30 నుంచి 35 సార్లు జిల్లాలు తిరిగి నా ఆరోగ్యం సైతం చెడగొట్టుకున్నాను.

అయినా, తెలంగాణకు సీఎం గా ఉన్న పెద్దమనిషి ఆదేశించాడు కనుక తప్పుకుంటున్నాను. ఈ రోజే రాజీనామా సమర్పించాను.
ఈ ఏడేళ్లూ నాతో నడిచిన, విధినిర్వహణలో నాకు అండగా నిలిచిన కొలీగ్స్ అందరికీ హ్రుదయపూర్వక క్రుతజ్ఞతలు. మీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను.
నా వైపు నుంచి ఎప్పుడైనా ఏమైనా తప్పు జరిగివుంటే నన్ను క్షమించండి.’’ అని మార్కండేయ జర్నలిస్టులకు రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది.

To Top

Send this to a friend