కేసీఆర్ అండ్ కో. కు ఇది పట్టదు..

 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరు.. రాజకీయాలపై ఆధారపడి పత్రికలు నడిపిస్తున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. తెలంగాణ రాకముందు ఆంధ్రా మీడియా అని ఘీంకరించిన కేసీఆర్ కు ఇప్పుడు అదే ఆంధ్రామీడియా దిక్కయ్యింది. ఆయనకు ఆంధ్రా మీడియా పెద్దలు ఆప్తులు అవుతున్నారు. ఆంధ్రా మీడియా అన్న పదం ఇప్పుడు నిషిద్ధం. అనుకోకుండా వాడితే రాష్ట్ర, ద్రోహులవుతారు. ఇప్పుడందరూ ఒక్కటే. అందరూ మనవాళ్లే. మనవాళ్లంటే.. మనవాళ్లు కాదు. పాలకుల వాళ్లు. వారి బంధువులు, వారికి మిత్రులు. వాళ్లకు ఏ ఆపద వచ్చినా వెళ్లి జలజలా కన్నీరు రాలుస్తారు. వెళ్లి పరామర్శిస్తారు. కూలదోస్తామని చెప్పిన భవనాల్లోకే వెళ్లి వారికి ఓదార్పుయాత్రలు చేస్తారు. కలానికి వేసిన సంకెళ్ల అప్పటికప్పుడు తెగిపోతాయి. సంకెళ్లు వేసినవారే తెంచేస్తారు కూడా.
తెలంగాణ సర్కారు కూడా అదే చేస్తోంది. మొన్నటి దాకా ఆంధ్రా మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా అని ఊదరగొట్టి, ఆ పత్రికలను తరిమికొట్టాలని ఏకంగా ప్రెస్ మీట్ లో చెప్పి, ప్రజలను రెచ్చగొట్టిన నేతలే ఇప్పుడు వారితో అలయ్ బలయ్ తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాస్తోందని టీఆర్ఎస్ నేతలంతా ఆంధ్రజ్యోతిని నానా మాటలన్నారు. ఏబీఎన్ ఛానల్ ప్రసారాలు కూడా ఆగిపోయాయి. ఇది తమ పని కాదని ప్రభుత్వం చెప్పినా… ఎమ్మెస్వోలతో ఎవరు చేయించారో మీడియాపై అవగాహన ఉన్న వారందరికి తెలుసు. దీంతో ఆంధ్రజ్యోతి కూడా ఎదురుదాడి మొదలు పెట్టింది. పేపర్ లో ప్రభుత్వ వార్తలు వేసిన ప్రతిచోట ఎన్నాళ్లీ సంకెళ్లు అంటూ ఓ రౌండ్ సీల్ వేసింది.
కానీ.. ఇదంతా గతం. అలాంటి పత్రిక యాజమాన్యం… ఇప్పుడు సర్కారుకు బెల్లమైంది. ఆంధ్రజ్యోతి ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ కంటే రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నేతలకే ఎక్కువ బాధైంది. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి చెప్పలేని బాధైంది. స్వయంగా ఆయన కూతురు ఎంపీ కవిత వెళ్లి కార్యాలయాన్ని పరిశీలించారు. రాధాకృష్ణను పరామర్శించారు కూడా. కానీ అంతటితో వీరి పరామర్శలు ఆగలేదు. ఏకంగా సీఎం కేసీఆర్.. ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి పరిశీలించారు. పరామర్శించారు. మరి కేసీఆర్ కు రాధాకృష్ణపై ఎందుకంత ప్రేమ అంటే… అక్కడే ఉంది రాజకీయం. వాళ్ల కాంట్రాక్టులు, వాళ్ల లెక్కలు వాళ్లకుంటాయి. ఎక్కడికి చేరిపోవాల్సినవి అక్కడికి చేరిపోతాయి. మొన్నటి శత్రువులు ఇవాళ్టి మిత్రులైపోతారు. వాళ్ల మాటలు విన్న జనం మాత్రం పిచ్చివాళ్లై చూడాలి. కానీ.. ఇంత జరిగినా రాధాకృష్ణ నిత్యం భజన చేసే చంద్రబాబు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ఖమ్మం మిర్చి యార్డు తగలబడింది.. మద్దతు ధర లేక రైతులు తాము పండించిన మిర్చి పంటను తగులబెట్టారు. రైతన్న అన్ని కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి కానీ.. మంత్రులు కానీ వారిని పరామర్శించిన పాపాన పోవడం లేదు. కానీ ఆంధ్రజ్యోతి ఆఫీసు తగులబడితే అందరూ పోయి ముసలికన్నీరు కార్చారు. వీరెవ్వరూ రైతులను పరామర్శించిన పాపన పోలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ సభ్యులు సైతం రైతుల వద్దకు వెళ్లకపోవడం విమర్శలకు తావిచ్చింది. కోట్లకు బీమా చేసిన రాధాకృష్ణ బిల్డింగ్ కు నష్టపరిహారం వస్తుంది. కానీ రైతు కాల్చిన పంటలు తిరిగి రావు.. రైతు కష్టం మరలా రాదు.. ఆర్థిక ఇబ్బందులు తీరవు.. రైతు గుండె చెరువైనా.. పట్టని ఈ రాజకీయ నేతల తీరు విస్తుగొలుపుతోంది..

To Top

Send this to a friend