కట్టప్ప సారీ..


దాదాపు 450 కోట్ల బడ్జెట్ ఏమాత్రం తేడా వచ్చినా బాహుబలి సినిమా మునిగిపోతుంది. నిర్మాతలు, దర్శకులు.. ఈ సినిమా కోసం పనిచేసిన వందలాది కుటుంబాల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే రాజమౌళి స్వయంగా కన్నడలో కన్నడ ప్రజలను వేడుకున్నారు. కట్టప్ప సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు సినిమాకు సంబంధం లేదని.. వందలాది కుటుంబాల కష్టం ఈ సినిమా అని.. బాహుబలి2ను కర్ణాటకలో అడ్డుకోవద్దని అభ్యర్థించారు.

కానీ బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రకటనను కన్నడ సంఘాలన్నీ లైట్ తీసుకున్నాయి. కట్టప్ప సత్యరాజ్ క్షమాపణ చెబితేనే తాము ఒప్పుకుంటామని.. లేకపోతే సినిమాను ఆడనిచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పాయి. దీంతో రాజమౌళి, నిర్మాతల ఒత్తిడి ఫలించింది. కట్టప్ప సత్యరాజ్ కన్నడ ప్రజలను ఓ లేఖను చదువుతూ వీడియో విడుదల చేసి క్షమాపణ చెప్పాడు.

తాను కర్ణాటకకు, కన్నడిగులకు వ్యతిరేకం కాదని.. సత్యరాజ్ స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశానని.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని సత్యరాజ్ కోరాడు. ఎవరి వ్యాఖ్యలు సినిమాను ప్రభావితం చేయకూడదని.. తన వల్ల బాహుబలి2 విడుదలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆయన చెప్పాడు.

బాహుబలి1 సినిమా కర్ణాటకలో దాదాపు 40కోట్లు వసూలు చేసింది. ఈ సారి 60కోట్లు వస్తాయని బాహుబలి టీం అంచానవేసింది. కానీ ఆందోళనతో కన్నడలో రిలీజే ప్రశ్నార్థకమైంది ఈ నేపథ్యంలో బాహుబలి2 లో నటించిన సత్యరాజ్ క్షమాపణ చెబితేనే సినిమా ఆడనిస్తామని కర్ణాటకలోని సంఘాలు ఉద్యమించాయి. ఎట్టకేలకు సత్యరాజ్ క్షమాపణలు చెప్పడంతో కర్ణాటకలో బాహుబలి2 విడుదలకు అడ్డంకులు తొలిగిపోయినట్లే..

To Top

Send this to a friend