కడపలో ఓటమి

ఇంట గెలిచి రచ్చ గెలువు’ అంటారు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే చేశారు. పులివెందుల, కడపను కాంగ్రెస్ కు కంచుకోటగా చేశారు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా కడప జనం వైఎస్ వెంటే నడిచారు. అందుకే అధికారంలోకి వచ్చాక కడప జిల్లా శరవేగంగా అభివృద్ది చెందింది. అక్కడి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి, వివిధ పథకాలు అందాయి. వైఎస్ కడపను రాష్ట్రంలోనే ప్రత్యేక అభివృద్ధి చేశారు. అందుకే వైఎస్ ను ఎప్పుడూ తమ కన్నబిడ్డలా చూసిన జనం, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆయన కుమారుడు, మొండి పట్టుదలతో పోతున్న జగన్ ను అలా చూడడం లేదు. అందుకు కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే ఉదాహరణ..

వైఎస్ జగన్ మొండిగా పోతున్నాడు. తన అనుయాయులు, నమ్ముకున్న వారిని విస్మరిస్తున్నాడన్న విమర్శలున్నాయి. వైఎస్ఆర్ కడపను తన కుటుంబానికి కంచుకోటగా మలిచాడు.అక్కడ కోట్లు కుమ్మరించినా.. వైఎస్ పై ఉన్న ప్రేమ ఆదారాభిమానాలే ఆయన్ను గెలిపించేవి. కానీ ఆ సపోర్టు జగన్ కు ఇవ్వడం లేదు.

గడిచిన నాలుగు దశాబ్ధాలుగా కడపలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న వైఎస్ ఫ్యామిలీకి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. అక్కడ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి.. వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిపై ఒకటి కాదు రెండు కాదు 33 ఓట్ల మెజారిటీతో గెలవడం సంచలనం రేపింది. జగన్ సొంత గడ్డపై టీడీపీ సాధించిన ఈ విజయం టీడీపీలో అంతులేని ఆనందాన్నిచ్చింది.

గతంలో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వీరు స్థానికేతరులు కావడం.. ఫ్యాక్షన్ పడగ ఉండకూడదనే జనం ఓడించారని చెప్పారు. కానీ ఫ్యాక్షన్, అభిమానం ప్రేమ.. ఇలా అన్నీ కలగలిసిన కంచుకోట కడపలో జగన్ ఎంతో మెజార్టీ ఉన్నా కూడా ప్రజాప్రతినిదులను కాపాడుకోకపోవడం విస్మయం పరిచింది. నాయకుడిగా సొంత పార్టీ నేతలనే ఆయన మేనేజ్ చేయలేకపోయాడు. అమ్ముడుపోయాడని ఆరోపిస్తున్న జగన్ .. వాళ్లకు భరోసా ఇవ్వడంలో వారి అభిమానాన్ని చూరగొనడంలో ఘోరంగా విఫలమయ్యాడంటే అతిశయోక్తి కాదు.

గడిచిన 2014 ఎన్నికల్లో కడపలో మొత్తం 10 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒకే స్థానం నుంచి మాత్రమే గెలిచింది. వైసీపీ 9 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీలు సీట్లు గెలిచింది. అలాంటి వైసీపీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు బోలేడు మంది గెలిచారు. వీరందరూ వైసీపీ పార్టీలోనే ఉన్నా కూడా ఆ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకా 33 ఓట్లతో దారుణంగా ఓడిపోయాడంటే రాజకీయంగా జగన్ పని అయిపోయిందనే చెప్పాలి.. సొంత ఇలాకాలోనే గెలిపించుకోలేని జగన్ ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఏం ప్రభావం చూపుతారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇందులో జగన్ తప్పు కూడా ఉంది. ఎంతసేపు పార్టీ అధ్యక్షుడిగా.. పాదయాత్రలు చేయడం తప్పితే క్షేత్రస్థాయి నాయకుల్లో భరోసా నింపడంలో వారికి పార్టీలో గుర్తింపు ఇవ్వడంలో జగన్ విఫలమయ్యాడనే ప్రచారం ఊపందుకుంది. అందుకే జగన్ అభిమానం గణం ఆయన వెంట నడవకుండా టీడీపీ విసిరిన డబ్బులకు ఆశపడి సొంత పార్టీరే ఓడించారు. ఇప్పటికైనా జగన్ సొంత పార్టీని, నాయకులను పట్టించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఉంటాడు.. లేకపోతే అథోగతే..

To Top

Send this to a friend