‘కె.విశ్వనాథ్’ గారికి అవార్డు


ఆయన సినిమా ఒక సందేశం.. ఆయన సినిమా ఒక వాస్తవిక దృశ్యరూపం.. అగ్రనటుడైన చిరంజీవి ఫుల్ ఫాంలో ఉండి కూడా ఆయన సినిమాలో చెప్పులు కుట్టే పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన చిత్రాల్లో తారలు కనపడరు.. సగటు జీవి అంతర్మథనమే కనిపిస్తుంది. భారతదేశంలోనే ఎవరెస్ట్ లాంటి దిగ్గజ దర్శకుడు కే.విశ్వనాథ్ ప్రతిభను కేంద్రం గుర్తించింది. విశ్వనాథ్ కు దేశ సినిమారంగంలో కీర్తికిరీటం లాంటి ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ను ప్రకటించింది. ఆయనకు ఈ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకుడి మనసు గౌరవంతో ఉప్పొంగుతోంది..
80వ దశకం రోజులు. కమర్షియల్ చిత్రాలు అదికంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఓ ‘వేటగాడు’ ఎన్టీఆర్, ‘ఖైదీ’ చిరంజీవి వంటి వారు ఫుల్ మాస్ మసాల సినిమాలతో 80వ దశకంలో తెలుగు సినిమాను ఉర్రూతలూగిస్తున్నారు. కానీ ప్రేక్షకులను మాస్ తోనే కాదు. కళాత్మక చిత్రాలు మెప్పించగలవని కే విశ్వనాథ్ నిరూపించారు. సంగీతం ప్రధానంగా ప్రేక్షకులను కంటతడి పెట్టించవచ్చని తెరపై చూపించి హిట్ కొట్టాడు. శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసి ‘శంకరాభరణం’ చిత్రాన్ని పెద్ద తారాగణం లేకుండా 1980లో తీసి ముసలాయన సోమయాజులును హీరోగా పెట్టి హిట్ కొట్టాడు. ఈ సినిమా తెలుగుతో ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందింది.
*ఆయన చిత్రాల్లో తెలుగుదనం..
విశ్వనాథ్ చిత్రాల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. భారతీయ సంప్రదాయం మేళవిస్తుంది. అందుకే ఆయన చిత్రాలన్నీ ఆణిముత్యాల్లా తెలుగుతెరపై కనువిందు చేస్తున్నాయి. ‘చెల్లిలి కాపురం (1971), శారద(1973), ఓ సీత కథ (1974), జీవన జ్యోతి(1975) చిత్రాలు అప్పటివరకు వంటింటికే పరిమితమైన స్త్రీల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటాయి. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం, నాట్యానికి సంబంధించిన చిత్రాలవైపు విశ్వనాథ్ అడుగులు పడ్డాయి. 1976లో సిరిసిరిమువ్వతో సంగీత ప్రధాన చిత్రాల ఒరవడి సృష్టించారు విశ్వనాథ్.. ఆ తరువాత శంకరాభరణంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు విశ్వనాథ్.. ఒక పేదవాడి కళాతృష్ణను కళ్లకు కట్టారు. సంగీత ప్రధాన సాగరసంగమం(1983)లో తీసి ఔరా అనిపించి జనం చేత కరతాళ ధ్వనులు కొట్టించారు. ఒక్కో పాట ఇందులో ఒక్కో ఆణిముత్యంలా వినిపిస్తుంది. ఆ తరువాత ఆయన తీసిన ‘శృతిలయలు(1987) ప్రేక్షకాదరణ పొందింది. స్వర్ణకమలం (1988) హీరో వెంకటేశ్ సినీ జీవితంలోనే గొప్ప చిత్రంగా మిగిలిపోయింది.. ఆ తరువాత తెలుగుతో పాటు అన్ని భాషల్లో హిట్ అయిన స్వాతిముత్యం(1986) సినిమా కమల్ నట విశ్వరూపాన్ని తెరపైకి ఆవిష్కృతం అయ్యింది. ఆ మరుసటి సంవత్సరమే అగ్రహీరోగా ఉన్న చిరంజీవిని చెప్పులు కుట్టే దళితుడి పాత్రలో చూపించి స్వయంకృషి (1987) తో జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
ఇలా ఇప్పటివరకు విశ్వనాథ్ దర్శకుడిగా తీసిన అన్ని సినిమాలు కళాఖండాలే.. అందులో హీరోలు కనపడరు.. సామాజిక సమస్యలు, కథనే కనిపిస్తుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నట్టు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే. విశ్వనాథ్ కు రావడం పట్ల ఆనందం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఫాల్కే కంటే గొప్ప దర్శకుడు విశ్వనాథ్.. ఆయన పేరు మీదే అవార్డు రావాలి ’ నిజంగా ఇది.. నిజం.. దేశం గర్వించే గొప్ప దర్శకుడికి ఇన్నాళ్లకు దక్కిన అరుదైన గౌరవమిది.. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ఇనుమడింప చేసిన కే.విశ్వనాథ్ తెలుగు వారందరికీ గర్వకారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలస్యంగానైన కేంద్ర ప్రభుత్వం ఓ దిగ్గజ దర్శకుడి ప్రతిభను గుర్తించింది.

To Top

Send this to a friend