ఎగిరిపోయిన న్యాయమూర్తి..


నిజమే.. న్యాయమూర్తి ఎగిరిపోయాడు. తలతిక్క పనులతో న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిన కోల్ కత హైకోర్టు జస్టిస్ కర్ణన్ ఆచూకీ ఇప్పుడు కనపడుట లేదని పోలీసులు తేల్చారు. కోల్ కత హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కర్ణన్ అసంబద్ధ నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కారు. న్యాయమూర్తిగా తన తీర్పుతో కులాల కుంపట్లను రగిలించారు. తోటి న్యాయమూర్తులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. తనపై అభిశంసనకు, బదిలీకి ఆదేశించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా కొందరు న్యాయమూర్తులకు జైలు శిక్ష విధించారు. ఈయన తీర్పులు వ్యవహార శైలికి విసిగి వేసారిన సుప్రీంకోర్టు కర్ణన్ ను తక్షణమే అరెస్ట్ చేసి 6 నెలలు జైలు శిక్ష విధించాలని తీర్పునిచ్చింది. దీంతో ఆ తీర్పు కాపీలను పట్టుకొని కోల్ కత పోలీసులు దేశమంతా జల్లెడ పడుతున్నారు.

సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా జస్టిస్ కర్ణన్ చివరగా తమిళనాడు, ఆంధ్ర బార్డర్ లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి ఆంధ్రా, తమిళనాడు పోలీసులు వెళ్లగా ఆచూకీ లభించలేదు. తమిళనాడుకు చెందిన కర్ణన్ బంధువుల ఇళ్లలో కూడా పోలీసులు వెతికారు. దీంతో ఆయన సన్నిహితులను కర్ణన్ గురించి ఆరా తీయగా.. ఆయన నేపాల్ కు పోయి అక్కడి నుంచి తన కుమారుడు ఉంటున్న ఫ్రాన్స్ దేశానికి చెక్కేశాడని తేలింది. దీంతో ఇలా ఓ న్యాయమూర్తి పలాయనం చిత్తగించడం దేశంలోనే అరుదైన విషయంగా మారింది.

ఇంతకుముందు కరుడు గట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు దేశం దాటి పోవడం చూశాం.. కానీ ఇప్పుడు ఓ న్యాయమూర్తి ఇలా ఎస్కేప్ కావడం పోలీసులను నివ్వెర పరిచింది.

To Top

Send this to a friend