జర్నలిస్టుల పరిస్థితి ఇదీ..


జర్నలిస్టుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. డబ్బు ఆశతో ఉన్న మీడియా సంస్థలను వదిలి కొత్తగా వచ్చిన చానళ్లు/పత్రికల్లో చేరిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి జీతాలు రాక.. సంవత్సరానికోసారి పెరగక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీడియాలోకి జంపింగ్ లో మొదట 2007లోనే ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరంలో వచ్చిన సూర్య, సాక్షి దినపత్రికల వల్ల జర్నలిస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అప్పుడు రూ.5 వేలకే పనిచేసిన జర్నలిస్టులను ఒక్కొక్కరికి 10వేలకు పైగా జీతాలిచ్చి ఈ సంస్థలు తీసుకున్నాయి. ఆ తదనంతర కాలంలో సూర్య పత్రిక మూసివేతకు దగ్గరగా ఉండగా.. సాక్షి చాలామందిని తీసేసింది. జీతాలు పెంచడం లేదు. ఇక కొత్తగా తెలుగు న్యూస్ చానాళ్లు పుట్టుకొచ్చి చాలామంది జర్నలిస్టులను తీసుకున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మూతపడుతున్నాయి. దీంతో జర్నలిస్టులు రోడ్డున పడుతున్నారు. ఎక్కడా అవకాశాలు లేకపోవడంతో హాహాకారాలు చేస్తున్నారు.

ఫలానా పార్టీలో కొంచెం డబ్బులు ఎక్కువున్న నాయకులు కనిపిస్తే చాలు.. ఏమయ్యా మన పార్టీకి హెల్ప్ అవుద్ది ఒక చానల్ పెట్టరాదు అని అప్పట్లో తెగ అనేవారు.. అందుకే ముందు వెనుక ఆలోచించకుండా రాజకీయ నాయకులు వివిధ చానల్స్ ఆరంభించి ఘనంగా ప్రారంబించేశారు. ఆ తరువాత కష్టనష్టాలకు ఒర్వక వదిలేశారు.. ఫలితం ఆ న్యూస్ చానల్ ను నమ్ముకొని వచ్చిన వందలాది మంది జర్నలిస్టులకు జీతాలు లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది..

మీడియా రంగం అనేది సినిమాల వలే రంగుల కళ.. కొత్తగా చానల్ పెట్టాం.. మీరు వేల జీతాలిస్తాం అనగానే ముందు వెనుక ఆలోచించకుండా కప్పదాట్లు చేస్తారు జర్నలిస్టులు.. ఆ తరువాత రెండేళ్లకే మూతపడడంతో లబోదిబోమంటారు… గత 6 సంవత్సరాలు నుండి తెలుగులో వచ్చిన ఎన్నో న్యూస్ ఛానల్స్ ఇప్పటికే ఎన్నోమూతపడ్డాయి. కొన్ని పాక్షికంగా నడుపుతున్నాయి. ఇదంతా ఇన్వెస్టర్లకు తెలుగు మార్కెట్ పై పట్టు లేక , అవగాహన లేమి. ఇండియాలోనే బిజినెస్ కి అనుకూలమైన ప్రదేశం ఒక్క తెలుగు రాష్ట్రాలే. అటువంటిది తెలుగు రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్స్ మాత్రం మీడియాలోకి అడుగులు వేసి నష్ట పోవటం అనేది నిజంగా వారి దురదృష్టకమైన సందర్భాలు ఇవి.

తెలుగులో దూసుకొచ్చిన 6TV, సంవత్సరంలోనే జీతాలు ఇవ్వలేక బోర్లాపడింది. అలాగే కామ్రేడ్ ఛానల్ TV99 పరిస్థితి అంతే. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తుంది మరో శాటిలైట్ న్యూస్ ఛానల్స్ సీవీఆర్ న్యూస్, EXPRESS TV. వీరికి సరైన మార్కెటింగ్ టీం ఉండి, పనిచేసే ఉద్యోగులు ఉన్నప్పటికీ..సంస్థ వీరికి గత 3 నెలలుగా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.. దీంతో జర్నలిస్ట్ లు ఇప్పటికే ఈ సంస్థని వీడి పలు సంస్థలకు మార్గాలను సుగమనం చేసుకుంటున్నారు. కొందరు జీతాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇలా ఆలోచించకుండా అడుగులు వేసి.. కార్పొరేట్ల దెబ్బకు జర్నలిస్టు మిత్రుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. కనీసం జర్నలిస్టు సంఘాలు సైతం స్పందించి వీరి జీతాలు ఇప్పించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

To Top

Send this to a friend