ఎన్నో ఏళ్ల సమస్యను సైలెంట్ గా పరిష్కరించారు..

ఉద్యోగాల్లో తెలంగాణ నిరుద్యోగులకు వివక్ష జరుగుతోందని ఉమ్మడి ఏపీలో తెలంగాణ వ్యాప్తంగా జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలోని ఉద్యోగాలు తెలంగాణ వారికే ఇవ్వాలన్న నిర్ణయంతో రాష్ట్రపతి సిఫార్సుల మేరకు తెలంగాణలో జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. అందులో భాగంగా ఉత్తర తెలంగాణను జోన్-5గా, దక్షిణ తెలంగాణను జోన్-6గా ఏర్పాటు చేశారు. ఏపీలో సైతం వీటిని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక ఇది అవసరమా అనే చర్చ సాగింది.

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడ్డ నేపథ్యంలో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కబోతున్నాయి. దాంతో పాటు జిల్లాను బేస్ గా చేసుకోవాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న కొన్ని పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులు జిల్లాను బేస్ చేసుకొనే భర్తీ చేస్తారు. దీంతో రాష్ట్రస్థాయిలో ఉన్న పోస్టులకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల వారు పోటీపడవచ్చు. జోన్-5, జోన్ 6 అంటూ ఉండవు. దీనివల్ల హైదరాబాద్ లో ఉన్న వేల ఉద్యోగాలకు ఉత్తర తెలంగాణ వారు కూడా అర్హులు.

అందుకే కేసీఆర్ సర్కారు..ఇప్పుడు ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధావులతో సమావేశమై తెలంగాణలో జోనల్ వ్యవస్థను ఎత్తివేయాలని కేబినెట్ లో ఆమోదించింది. బిల్లును రాష్ట్రపతికి పంపింది. ఇది అమలైతే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. కేవలం జిల్లా, రాష్ట్రస్థాయిలో మాత్రమే ఇకపై పోస్లులు ఉంటాయి. జోన్ పోస్టులు ఉండవు.దీనివల్ల వేల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. ఏ జిల్లా వారు ఆ జిల్లాకు పోటీపడతారు. రాష్ట్రస్థాయి పోస్టులకు రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ దక్కుతాయి. దీంతో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. అందుకే ఇప్పుడు కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం అమలైతే తెలంగాణలో ఏన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం దక్కినట్టే..

To Top

Send this to a friend