‘జై లవకుశ’ స్థాయి ఇది

ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ మొదటిసారి త్రిపాత్రాభినయం చేయడంతో పాటు అన్నదమ్ముల కలయికలో వస్తున్న సినిమా అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్‌ భారీ అంచనాలు ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన గెస్ట్‌రోల్‌లో హరికృష్ణ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా స్థాయి మరింతగా పెరుగుతుంది.

సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే పలు ఏరియా నుండి నిర్మాత కళ్యాణ్‌ రామ్‌కు భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సీడెడ్‌ నుండి అదిరిపోయే ఆఫర్‌ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఓవర్సీస్‌లో ఈ సినిమాను పంపిణీ చేసేందుకు ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ముందుకు వచ్చింది. వారు ఈ సినిమాకు ఏకంగా 15 కోట్లు ఇస్తామని ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నటించిన ఏ సినిమా కూడా ఓవర్సీస్‌లో 15 కోట్లు సాధించలేదు. అయితే ఈ సినిమా స్థాయితో అక్కడ అంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.

ఒక్క ఓవర్సీస్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోన్ని అన్ని ఏరియాలు మరియు కర్ణాటక కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాను 40 కోట్ల బడ్జెట్‌తో కళ్యాణ్‌ రామ్‌ నిర్మించనున్నాడు. ఎన్టీఆర్‌కు లాభాల్లో షేర్‌గా పారితోషికం మాట్లాడుకోవడం జరిగింది. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వంద కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే విడుదలకు ముందే 60 కోట్ల భారీ లాభాలు నందమూరి వారు తమ ఖాతాలో వేసుకోబోతున్నారన్నమాట. ఈ లెక్కలు చూస్తుంటే ‘జై లవకుశ’ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

To Top

Send this to a friend