జగ్గూభాయ్..రైతుల కోసం బంగారం..


జగ్గారెడ్డి.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత.. భారీ జట్టు, గడ్డంతో , పదునైన పంచులతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే నేత. కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సహా డబ్బు ఉన్న వాళ్లందరూ పార్టీ కోసం ఖర్చు పెట్టాలంటే తటపటాయిస్తారు. కానీ జగ్గారెడ్డి మాత్రం పార్టీ కోసం, ఆపదలో ఉంన్న నాయకులు, కార్యకర్తల కోసం ఎంతైనా ఖర్చు చేస్తారనే ప్రచారం ఉంది. అందుకే మొన్ననే సంగారెడ్డిలో లక్షల మందితో బహిరంగ సభను చాలా ఖర్చు చేసి నిర్వహించారు. దీనికి రాహుల్ గాంధీని కూడా రప్పించి సభ సక్సెస్ చేశారు. భారీగా యువత, ప్రజలు రావడంతో అధికార టీఆర్ఎస్ కూడా ఉలిక్కిపడింది.

అయితే సంగారెడ్డి సభ సక్సెస్, ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సభా వేదికపైనే జగ్గారెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారంటూ కీర్తించారు. అదే వేదిక మీదున్న మాజీ ఎంపీ వీహెచ్ కూడా సభకు తనవంతుగా తన చేతికున్న బంగారు బ్రాస్ లెట్ ను జగ్గారెడ్డికి కానుకగా ఇచ్చారు.

కాగా వీహెచ్ ఇచ్చిన బ్రాస్ లెట్ ను ఏం చేయాలని గాంధీభవన్ లో విలేకరులతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి అడిగాడు. దీనికి కొందరు దాన్ని వేలం వేయాలని.. ఖమ్మంలో జైలు పాలైన రైతులకు ఆ మొత్తం ఇవ్వాలని సూచించారు. దీనికి సరేనన్న జగ్గారెడ్డి ఆ మంచి పనికి ముందుకొచ్చారు. ఈరోజు గాంధీ భవన్ లో ఆ బంగారు బ్రాస్ లెట్ ను వేలం వేయనున్నారు. వచ్చే ఎంతమొత్తమైనా రైతులకు ఇవ్వనున్నారు. దీంతో కాంగ్రెస్ సానుభూతిపరులు ఈ మంచిపనిలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట.. దీనికి భారీ మొత్తం వచ్చే అవకాశాలున్నాయని తెలిసింది. ఇలా జగ్గారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో మాస్ లీడర్ గా ఎదుగుతున్నారు.

To Top

Send this to a friend