జగన్ రెడ్డి పై నమ్మకం లేదు..

కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిన నిధులు నిర్దేశించిన రంగాల్లో ఖర్చు చేయడం లేదు. అలాగే రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యక్రమాలకు తప్పనిసరి గా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ నిధులను వేరే ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నది. ఉదాహరణకు రాష్ట్ర ఎస్ సి కార్పొరేషన్ నిధులు సుమారు 6,000 కోట్ల రూపాయలు “అమ్మ ఒడి ” పథకానికి ఖర్చు చేశారు. అలాగే కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి కేటాయించిన నిధులను కూడా ” అమ్మ ఒడి ” పథకానికి ఖర్చు చేశారు. సంవత్సరానికి సుమారు 15,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చుతో “అమ్మ ఒడి” పథకం అమలు చేయడం దాదాపు అసాధ్యం.అది ఆంద్రప్రదేశ్ రాష్ట్రం స్థోమతు ని మించిన ఖర్చు.

అలాగే గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఇతర ప్రభుత్వ అవసరాలకు మళ్లించారు. ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో కోర్టులు ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో సమస్య ఏమిటంటే గత ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన అలవి కానీ హామీలను అమలు చేయడానికి అనేక ప్రాధాన్య రంగాలను విస్మరిస్తూ ఉండడం. దానివల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతోంది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములు కూడా అమ్మి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తున్నది.
ఈ పరిస్థితి ఇలా ఉంటే హటాత్తుగా ఊడి పడ్డ “కరోనా వైరస్ ” విపత్తు వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషమంగా మారిపోయి ప్రభుత్వ ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉంది. కరోనా విపత్తు ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తొలి విడతగా 15,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుండి కరోనా విపత్తు ఎదుర్కోవడానికి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రక్కదారి పట్టే అవకాశం ఉంది అని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక వసతుల పై వెచ్చించకుండా ఇతర ఖర్చులకు మళ్లించకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారులకు,ప్రజలకు తగు సూచనలు ఇస్తూ కఠిన చర్యలు చేపట్టారు.కానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటివరకు అరకొరగా తప్ప సరైన చర్యలు తీసుకోలేదు.బ్లీచింగ్ పౌడర్, పారాసేటమాల్ లకు ఖర్చు చేసేసాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఇవ్వకుండా కరోనా నివారణకు కేటాయించిన నిధుల ఖర్చు పై కేంద్ర ప్రభుత్వం తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి.

జగన్ రెడ్డి కూడా ఈ విషయంలో భేషజాలకు పోకుండా తన సొంత తెలివితేటలు ప్రక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తే రాష్ట్ర ప్రజలకు మంచిది.
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend