ఆ తొమ్మిదితో జగన్ కు అధికారం పక్కా

జగన్ తన అమ్ముల పొదిలోని 9 అస్త్రాలను బయటకు తీశాడు. పాదయాత్రతో ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు బయలు దేరాడు.. ‘అన్నొస్తున్నాడు’ అంటూ ఏపీ ప్రజలకు భరోసానిచ్చాడు. నవ్యాంధ్రలో నవ వసంతానికి జగన్ బాటలు పరిచాడు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 9 అద్భుత పథకాలను అమలు చేస్తానని గుంటూరులో జరుగుతున్న ప్లీనరీ సాక్షిగా జగన్ ప్రకటించారు. అంతేకాదు.. రాష్ట్ర బడ్జెట్ కు అతి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి గొప్ప నిర్నయం తీసుకున్నారు. హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తీరును ప్లీనరీలో ఎండగట్టారు. రాబోయే రోజుల్లో అధికారం దక్కితే తాను ఏం చేయబోయేది.. పాదయాత్రలో ప్రజలకు వివరిస్తానని చెప్పాడు. ఆక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించాడు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 3వేల కి.మీ మేర పాదయాత్ర చేయనున్నట్టు వెల్లడించారు.

జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు ఇవీ.
1) రైతులకు రూ.50వేలు..
జగన్ ప్రకటించిన అన్ని పథకాల్లో ఎక్కువ ప్రజాదరణ పొందేది ఇదే.. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం వల్ల ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతారు. ఐదెకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ. 50వేలు సాగు ఖర్చులకు ఇస్తామని జగన్ ప్రకటించారు. ఇందుకోసం 3వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి, 2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి తెస్తామని ప్రకటించారు. దీనివల్ల ఏపీలోని దాదాపు 66 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

2) వైఎస్ఆర్ ఆసరా..
మహిళా సంఘాలు, డ్వాక్రా రుణాలను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని జగన్ ప్రకటించారు. డ్వాక్రా రుణాలు దాదాపు 15వేల కోట్లు మాఫీ చేస్తామని.. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల దాదాపు 89 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలుగనుంది.

3) పింఛన్ 2వేలకు పెంపు
ఇక రైతుల తర్వాత వృద్ధులు, పేదలకు లబ్ధి చేకూర్చే మరో పథకాన్ని జగన్ ప్రకటించారు. ప్రతి ముసలి వాళ్లకు, వికలాంగులకు ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్ ను రూ.1000 నుంచి 2000కు పెంచి పక్కాగా అమలు చేస్తామని జగన్ ప్రకటించారు. దీనివల్ల ఏపీలో 45 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది.

4) అమ్మఒడి
పేదల చదువుకు భరోసానిచ్చే పథకమిది.. ఇద్దరు పిల్లలున్న కుటుంబాల్లో పిల్లలుంటే వారి చదువుల కోసం నెలకు వెయ్యి నుంచి 2వేల వరకు అందించేందుకు జగన్ ఈ పథకాన్ని ప్రకటించారు.

5) పేదలందరికీ ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్లతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న వైఎస్ స్ఫూర్తితో జగన్ పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. డబ్బు అవసరమైతే ఇంటిని తనఖా పెట్టి పావలావడ్డీకే రుణం ఇస్తామని ప్రకటించారు. దీనివల్ల 25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది.

6) ఆరోగ్యశ్రీకి పెద్ద పీట..
వ్యాధిగ్రస్తులకు రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకం ఇప్పటికీ అమలవుతోంది. దీనికి పూర్వ వైభవం తీసుకొస్తానని జగన్ ప్రకటించారు. కుటుంబంలోని వ్యక్తి జబ్బు పడితే కుటుంబం బతకడానికి డబ్బులు అందిస్తామని ప్రకటించారు. కడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ అందిస్తానని చెప్పారు. దీనివల్ల ఏపీలో 45 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.

7)ఫీజు రీయింబర్స్ మెంట్
పేద విద్యార్థులకు ఈ పథకం వరం.. వారి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఫీజు రీయింబర్స్ మెంటుతో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20వేలు అందిస్తామని జగన్ ప్రకటించారు. దీని ద్వారా ఏపీలోని 15.80 లక్షల మంది విద్యార్తులు ప్రయోజనం పొందనున్నారు.

8)జలయజ్ఙం
రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తానని జగన్ ప్రకటించారు. అన్ని ప్రాజెక్టులను అధికారం లోకి వచ్చాక పూర్తి చేస్తానని జగన్ ప్రకటించారు. దీనివల్ల అదనంగా 56 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి.

9) మద్యనిషేధం..
రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయమిచ్చే మద్యాన్ని నిషేధిస్తానని జగన్ ప్రకటించడం విశేషంగా చెప్పవచ్చు. ఎంతో మంది పేదల ఉసురు తీస్తున్న మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తానని జగన్ ప్రకటించారు. ముందు బెల్ట్ షాపుల రద్దు, తర్వాత వైన్ షాపుల కుదింపు.. తరువాత ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే దొరికేలా చట్టం చేస్తున్నట్టు ప్రకటించారు.

జగన్ అధికారమే లక్ష్యంగా ప్రకటించిన ఈ తొమ్మిది పథకాలు ప్రజల నోట్లల్లో నానుతున్నాయి. పాదయాత్ర ద్వారా 13 జిల్లాల్లో ఈ తొమ్మిది పథకాలపై జగన్ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ తొమ్మిదే తనకు అధికారం తీసుకురావడానికి నవరత్నాలను జగన్ భావిస్తున్నారు.

To Top

Send this to a friend