‘గోవధనిషేధం’ వెనుక విస్తుగొలిపే కథ..

గోవధ అంశంపై సుప్రీంకోర్టు తాజా స్టేతో మోడీ సర్కారు కి “షాక్” అనీ, హిందుత్వ శక్తులకి”చురక” అని వ్యాఖ్యలు వినిస్తున్నాయి. ప్రకటిత రాజ్యాంగ పునాదులకి విరుద్ధంగా మోడీ సర్కారు మే23 నాటి ఉత్తర్వు ఉందని సుప్రీం కోర్టుకు తెలియనిది కాదు.దానికి రెండేళ్లు ముందు నుండి ఆవు పేరుతో జరిగే మారణకాండ తెలియనిది కాదు. బాబ్రీ, ఉనా ఘోరాలూ, దభోల్కర్,పన్సారే, కల్బుర్గి హత్యలూ తెలియనిది కాదు. గణతంత్ర రాజ్యనీతికీ, మను ధర్మ నీతికీ పొత్తు ఉండదన్న సంగతి తెలియనిది కాదు. అలాంటి సమయాలలో తనకి తానే స్పందించి”సుమోటో” గా విచారించి, తగు ఆదేశాలు ఇచ్చే అవకాశం సుప్రీంకోర్టు కి ఉంది. అంతేకాదు, అవార్డు గ్రహీతలైన ప్రముఖ చరిత్ర పరిశోధకులు, శాస్త్రజ్ఞులు, రచయితలు,మేధావులు, కవులు, కళాకారులు తమ పురస్కారాలను గడ్డిపరకలు గా తిరస్కరిస్తున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ, మోడీ కానీ స్పందించ లేదు. ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది..

గత మూడేళ్లలో మొదటి సారి మోడీ సర్కారు రకరకాల ఒత్తిళ్ళని ఎదుర్కోంటోంది. దేశ వ్యాప్త రైతు ఉద్యమంతో పాటు చిన్న పారిశ్రామిక,వర్తక వర్గాల ఆందోళనల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. అంతేకాకుండా మే23నాటి “పశువధ” పై ఉత్తర్వు కూడా మోడీ సర్కారు అంచనాలను తలకిందులు చేసింది. ఈ నిర్ణయం వెనుక మిగిలిన పౌర సమాజం నుండి ముస్లిమ్స్ ని వేరుచేసి బలపడాలన్న లక్ష్యం ఉంది. కానీ ఇది ఆచరణలో దళితులని అనూహ్యంగా సంఘటితం చేసింది. గోద్రా లో ముస్లిమ్స్ పై దాడికి దళితులని ఆర్.ఎస్.ఎస్, బీజేపీ లు రెచ్చగొట్టాయి. ా ఆర్.ఎస్.ఎస్. ప్రయోగశాల “గుజరాత్”లోనూ మరో ప్రయోగశాల యూపీ లోనూ దళితుల సమీకరణ సాధనంగా “మే23ఉత్తర్వు” మారింది. మోడీ గుజరాత్, యోగీ యూపీలే నేడు నూతన పంథాలో దేశ వ్యాప్త దళిత ఉద్యమాలకి కేంద్రాలుగా మారుతున్నాయి.పైగా ఇంత కాలం బిక్కుబిక్కు మంటూ అభద్రతతో బతుకుతున్న ముస్లిమ్స్ కి దళితులు రక్షణ కవచంగా మారుతున్న కొత్త పరిస్థితి ముందుకొస్తున్నది. ఇది ఆర్.ఎస్.ఎస్. ముందస్తు అంచనాని దెబ్బతీసింది.

ఇకపోతే మహారాష్ట్ర రైతు సంఘాలు జూన్ 21నుండి “మార్కెట్లకు పంట బంద్” నినాదంతో దేశంలో వినూత్న సమ్మెకు మొదటిసారి పిలుపు ఇచ్చాయి. అందులో శివసేన కీలక పాత్రధారి.వాజ్ పాయ్ ప్రభుత్వం బతకనేర్చిన బుద్ధితో తమ మొదటి హిందుత్వ తీవ్రతను కొంత తగ్గించుకున్న టైములో దూకుడుగా మతోన్మాద వైఖరిని చేపట్టిన గత చరిత్ర శివసేనకి ఉంది. రైతు ఉద్యమం నుండి శివసేనని తప్పించే కొత్త అవసరం కోసం “ఆవు”ని ఓ ఆయుధంగా ఆర్.ఎస్.ఎస్. ఎంచుకుంది. దేశంలో ఉన్మాదం పెంచాల్సిన ఎలాగూ ఉంది. ఇక నిర్దిష్టంగా జూన్ 1 నుండి రైతు ఉద్యమ ప్రారంభం సందర్భంగా తరువాత జులై 1 నుండి GST ప్రారంభం సందర్భం కూడా దేశ ప్రజలని పక్కదారి పట్టించాల్సిన నిర్దిష్ట కొత్త అవసరం కూడా మోడీ సర్కార్ ముందుకు వచ్చింది.

రైతు సమ్మెకు సరిగ్గా వారం ముందు “పశువధ” ఉత్తర్వును మోడీ సర్కారు ఇవ్వడం గమనార్హం. తరతరాలుగా పశు యాజమానులైన రైతాంగం తమ మనుగడ కోసం నూతన పంథాలో పొరుకి సిద్దమయ్యే సమయమది. అదే “శుభ ముహూర్తం” గా ఆర్.ఎస్.ఎస్. ఎంపిక చేసింది. రైతు ప్రేమించే ఆవుని పావుగా చేసుకొని అదే రైతుని బలిపీఠం ఎక్కించే దుష్ట లక్ష్యం తో పై ఉత్తర్వు తెచ్చింది. కానీ మహారాష్ట్ర రైతు సమ్మె ఆగ లేదు.పైగా ఉత్తర్వు ఇచ్చిన 2 వారాలు తిరక్కముందే మధ్యప్రదేశ్ కాల్పులకి దారి తీసింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలని నేడు రైతు ఉద్యమం కుదిపి వేస్తున్నది. మోడీ మెడకి గుదిబండగా మారుతున్నది.

జైనులు గోహత్యని ఎక్కువగా వ్యతిరేకిస్తారు. గుజరాత్, రాజస్థాన్, మహా రాష్ట్రల్లో జైనులకి వ్యాపారాల్లో ప్రముఖ పాత్ర ఉంది. ఆర్.ఎస్.ఎస్., పూర్వ జనసంఘ్ లకి ఈ వ్యాపార వర్గ పునాది ఉండేది. గత పాతికేళ్ల లో ఇది మరింత పెరిగింది. మోడీ సర్కారు నేడు కొద్దీ మంది బడా పెట్టుబడిదార్ల పక్షాన ఉంది. వాళ్ళ లక్ష్యం ఈ తరహా వ్యాపారాలని కూడా కబ్జా చేయడం. హిందూ మత ధర్మం రీత్యా తమకు దగ్గరైన జైనులని దెబ్బతీయకుండా ఆర్ధిక రంగంలో తమ గ్రాండ్ మాస్తారులైన ద్రవ్య పెట్టుబడి దారీ శక్తులకీ మోడీ సర్కారు సేవ చేయ లేదు. అంతిమంగా అలంటి వ్యాపార, వర్థకాలను బలిపీఠం ఎక్కించే GST ని నిరాటంకంగా అమలు చేయించుకోవాల్సిన కొత్త అవసరం కూడా మోడీసర్కారు ముందుకొచ్చింది. జైనులు ప్రేమించే “,ఆవు” ని పావుగా చేసి జైనులని దెబ్బతీయడం మోడీ సర్కారు లక్ష్యం. ఆర్.ఎస్.ఎస్. , బీజేపీ (పూర్వ జనసంఘ్) లకి గత ఆరేడు దశాబ్దాలుగా నిధులిచ్చి, పెంచి, పోషించిన సంపన్న వ్యాపార వర్గాలను దెబ్బతీసే అవసరం కోసం వాళ్ళు ప్రేమించే ఆవు ను మారణాస్త్రంగా మోడీ సర్కారు ఎంపిక చేయడం గమనార్హం. కానీ ఈ పధకం కూడా బెడిసి కొట్టింది. భారతదేశ టెక్స్టైల్స్ సిటీ, డైమండ్ సిటీగా, గుజరాత్ వాణిజ్య రాజధానిగా పేరొందిన సూరత్ నేడు జీఎస్టీ వ్యతిరేక పొరుకి కేంద్రంగా మారింది. ఇంత వరకూ ఆర్.ఎస్.ఎస్.కి దన్నుగా ఉన్న వ్యాపారవర్గాలే ఈ పోరులో ముందున్నారు. వారి ఐక్యతను “ఆవు” అను అస్త్రం బాలహీనపరచలేక పోయింది. పైగా హిందూ ధర్మం “ఆవు” ను పూజించాలన్నది తప్ప ఆవు కోసం మానవుని చంపాలని చెప్పలేదంటూ మత సంస్కరణకి దారి తీస్తుంది. భౌతిక వాద ప్రజావసరాల నుండి ఈ తరహా సంస్కరణలు ముందుకొస్తాయని మార్స్, ఎంగెల్స్ చెప్పడం తెల్సిందే. ఏది ఏమైనా ఈ విషయంలో కూడా మోడీ సర్కారు నేడు ఆత్మ రక్షణ స్థితిలో పడింది.

భారీ లాభాలనిచ్చే బీఫ్ విదేశీ వ్యాపారం దెబ్బ తిన్నది. విదేశీ మాంసం వ్యాపార కంపెనీలు నేడు మోడీ సర్కారు పై ఒత్తిళ్ల తెస్తున్నాయి. స్వదేశీ బాద్షా బీఫ్ ఎగుమతి కంపెనీల్లో ఎక్కువ హిందూ సంపన్నులవే. అటు విదేశీ, ఇటు స్వదేశీ బీఫ్ కంపెనీల ఒత్తిళ్ల కూడా మోడీ సర్కారు పై పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడిలో మోడీ సర్కారుకి రక్షణ కవచం గా పై తీర్పు వచ్చింది.. న్యాయమూర్తుల మనస్సుల్లో ఏ ఉద్దేశ్యాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. ఈ తీర్పు ఆచరణలో ఏ ఫలితాలను ఇస్తుందన్నది ముఖ్యం.అందుకే ఇది మోడీ సర్కారికి, ఆర్.ఎస్.ఎస్. లకి షాక్ కాదు. ఆత్మరక్షణ కవచం మాత్రమే. తమ తప్పును సరిదిద్దుకునేందుకు దొరికిన బంగారు అవకాశంగా బీజేపీ దీన్ని మలుచుకుంటోంది. గోవధ నిషేధాన్ని ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతను సుప్రీం తీర్పుతో తగ్గించుకోవాలనుకుంటోంది. దీంతో గోవధ నిషేధంపై స్టే బీజేపీకి అందివచ్చిన అదృష్టంగా మారింది.

To Top

Send this to a friend