జగన్‌ తప్పు చేస్తున్నాడు

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్‌ కిషోర్‌ను నమ్ముకున్నాడు. వందల కోట్ల రూపాయలను ఆయనకు ఇచ్చి వచ్చే ఎన్నికల కోసం వ్యూహం రచించాల్సిందిగా కోరాడు. ఆయన కూడా జగన్‌ను వచ్చే ఎన్నికల్లో గెలుపు బాట పట్టించేందుకు ఇప్పటి నుండే వ్యూహం రచిస్తున్నాడు. తాజాగా వైకాపా ప్లీనరీ సమావేశాలు జరిగాయి.

ఆ సమావేశంలో ప్రత్యేకంగా ప్రశాంత్‌ కిషోర్‌ను వైకాపా శ్రేణులకు పరిచయం చేయడంతో పాటు, ప్లీనరీలో ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. రెండు రోజులు కూడా ప్లీనరీలో ప్రశాంత్‌ కిషోర్‌ సందడి కనిపించింది. పార్టీలో మొదటి నుండి ఉన్న నాయకుల కంటే ఇప్పుడు వైకాపాలో ప్రశాంత్‌ కిషోర్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆడినదే ఆటగా, పాడినదే పాటగా జగన్‌ కూడా సై అంటున్నాడు. ఈ వ్యవహారం పార్టీ సీనియర్‌ నాయకులకు రుచించడం లేదు. తాము పార్టీ కోసం ఎంతో కష్టపడుతుంటే ఆయన కోసం మమ్ములను పక్కన పెట్టడం ఏంటని కొందరు అసహనంతో ఉన్నారు. కొందరు ఎన్నికల ముందు అధికార పార్టీలోకి దూకేందుకు కూడా సిద్దం అవుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో వైకాపాను విజయం వైపుకు తీసుకు వెళ్లేందుకు జగన్‌ అలా వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం పార్టీ విజయం కోసం ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు పాటించడం ఓకే కాని, పార్టీ సీనియర్‌ నేతలను పక్కన పెట్టడం ఎంత మాత్రం మంచి పద్దతి కాదని, పార్టీ సీనియర్‌లు తప్పుకుంటే ఎన్నికల్లో గెలుపు కష్టం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌తో పాటు పార్టీ నాయకులు కూడా చాలా ముఖ్యం అని జగన్‌ తెలుసుకోవాలని, అలా కాకుండా పార్టీ సీనియర్లను పక్కన పెట్టడంతో జగన్‌ తప్పు చేస్తున్నాడు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

To Top

Send this to a friend