ఇరకాటంలో చంద్రబాబు..


నంద్యాల ఉప ఎన్నికల చంద్రబాబుకు చిక్కుతెచ్చిపెడుతోంది. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ సీటుపై కన్నేసిన నంద్యాల టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి శిల్పా మోహన్ రెడ్డి ఈ సీటు ఉప ఎన్నికల్లో తనకే ఇవ్వాలని చంద్రబాబుకు అల్టిమేటం జారీచేశారు. ఇవ్వకపోతే వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేస్తానని.. లేకుంటే రెబల్ గానైనా పోటీచేసి తీరుతానని విజయవాడలో బాబును కలిసి స్పష్టం చేశాడట.. దీంతో బాబు నాలుగైదు రోజులు సమయం ఇవ్వాలని భూమా ఫ్యామిలీతో మాట్లాడి సీటు విషయం తేలుస్తానని హామీ ఇచ్చాడట.. దీంతో బయటకొచ్చిన శిల్పా తాను టీడీపీ తరఫునే పోటీచేస్తానని.. నంద్యాలలో క్యాడర్ కాపాడుకోవడానికి సీటు వచ్చినా రాకున్నా పోటీచేసి తీరుతానని అల్టిమేటం జారీ చేశారు.

కాగా భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన సీటును తమ కుటుంబానిదేనని మంత్రి అఖిలప్రియ చంద్రబాబుకు స్ఫష్టం చేసినట్టు సమాచారం. నాన్న మరణంతో ఖాళీ అయిన సీటులో తమ కుటుంబానికే సీటు ఇవ్వాలని లేకపోతే జనం ఎవ్వరినీ గెలిపించరని ఆమె చంద్రబాబుకు చెప్పారట.. సానుభూతి ఉంది కాబట్టి జనం తమ కుటుంబాన్నే గెలిపిస్తారని.. శిల్పా మోహన్ రెడ్డికి సీటు ఇవ్వవద్దని స్పష్టం చేశారట.. సో నంద్యాల ఉప ఎన్నిక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

నంద్యాల సీటులో అఖిల ప్రియ తన చెల్లెలును పోటీకి దింపాలని యోచిస్తోంది. నాన్న నాగిరెడ్డి సానుభూతి పవనాలతో చెల్లెలు గెలుస్తుందని ఆశిస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి మాత్రం తాను టీడీపీ తరఫున నంద్యాల నుంచి చానాళ్లుగా ఇన్ చార్జిగా సేవలందించానని.. ఇప్పుడు టీడీపీ తరఫున తనకే ఇవ్వాలని కోరుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి జంప్ తో ఇప్పుడు అక్కడ వైసీపీకి బలం లేకుండా పోయింది. దీంతో శిల్పాకు టికెట్ ఇవ్వకపోతే ఆయన వైసీపీ తరఫున పోటీచేయడం ఖాయంగా తోస్తోంది. కాబట్టి ఎటు చూసినా ఈ సీటు వైసీపీ కే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

To Top

Send this to a friend